Mahaa Daily Exclusive

  పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా..? రేవంత్‌ సర్కారుపై బండి సంజయ్ నిప్పులు..!

Share

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులపై మజ్లిస్ నేతలు దాడులకు తెగబడినా చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. “ముఖ్యమంత్రి గారు.. పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? అక్కడ దౌర్జన్యాలు, దోపిడీలు చేసుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఇచ్చారా?” అని నిలదీశారు. సోమవారం సాయంత్రం పాతబస్తీలోని మురళీధర్ ఆలయాన్ని దర్శించుకున్న బండి సంజయ్, అనంతరం స్థానిక బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

 

**రెండు ప్రాంతాలకు రెండు రూల్లా?**

 

నగరంలోని ఇతర ప్రాంతాల్లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం, పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులపై దాడులు జరిగితే ఎందుకు మౌనంగా ఉందని సంజయ్ ప్రశ్నించారు. “పాతబస్తీకి ఒక రూల్, మిగిలిన ప్రాంతాలకు మరో రూలా? అధికారులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదా?” అని నిప్పులు చెరిగారు. కూల్చివేసిన చోటే గంటల వ్యవధిలో మళ్లీ నిర్మాణాలు జరుగుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం సిగ్గుచేటని, రేవంత్ రెడ్డి హోం మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, దేవాలయాలు, గోవులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

**మమతపై ధ్వజం.. బెంగాలీలకు పిలుపు**

 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నివసిస్తున్న సుమారు 60 వేల మంది బెంగాలీలను ఉద్దేశించి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయనీయకుండా మమతా బెనర్జీ అడ్డుపడుతున్నారని, చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని ఆమె కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని తమ బంధుమిత్రులతో మాట్లాడి బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. యూపీఏ హయాం నుంచి రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ పరిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశ భద్రతను పణంగా పెట్టాయని విమర్శించారు.

 

**అభివృద్ధిపై ఎద్దేవా**

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఉపన్యాసాలకే పరిమితమయ్యారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. “పక్కనే ఉన్న పాతబస్తీని అభివృద్ధి చేయలేని వ్యక్తి, బాసరకు వెళ్లి ఆదిలాబాద్‌ను వేల కోట్లతో అభివృద్ధి చేస్తానంటే నమ్మేదెలా?” అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాతబస్తీలో బెంగాలీ కుటుంబాల పిల్లలకు మజ్లిస్ గూండాలు డ్రగ్స్ ఎరవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా రాష్ట్రం సహకరించడం లేదని, తక్షణమే పాతబస్తీ పరిణామాలపై సీఎం స్పందించాలని, లేనిపక్షంలో పరిస్థితులు అదుపు తప్పుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, జిల్లా అధ్యక్షులు ఉమామహేందర్ తదితరులు పాల్గొన్నారు.