- కల్పక్కంలో రగిలిన స్వదేశీ అణు జ్వాల!
- హోమీ భాభా కలకు సజీవ రూపం.
- ‘క్రిటికాలిటీ’ సాధించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్!
- పౌర అణు శక్తి రంగంలో రెండో దశలోకి సగర్వంగా అడుగుపెట్టిన భారతదేశం.
- అగ్రరాజ్యాలు సైతం చేతులెత్తేసిన సాంకేతికతను స్వదేశీ పరిజ్ఞానంతో వశపరుచుకున్న భారతీయ శాస్త్రవేత్తలు!!
- స్వదేశీ శాస్త్రవేత్తల మేధో విజయం.
హైదరాబాద్, మహా.
భారతదేశ అణు ఇంధన చరిత్రలో అత్యంత సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. ఏడు దశాబ్దాల వ్యూహాత్మక నిరీక్షణ, రెండు దశాబ్దాల శాస్త్రవేత్తల అహర్నిశల శ్రమ ఫలించి దేశం గర్వించదగ్గ అద్భుతం ఆవిష్కృతమైంది. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఐదు వందల మెగావాట్ల సామర్థ్యం గల ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ అత్యంత కీలకమైన ‘క్రిటికాలిటీ’ దశను చేరుకుంది. బాహ్య జోక్యం లేకుండా అణు విచ్ఛిత్తి (న్యూక్లియర్ ఫిషన్) గొలుసు చర్య నిరంతరాయంగా, స్థిరంగా కొనసాగే దశనే సాంకేతిక పరిభాషలో ‘క్రిటికాలిటీ’ అంటారు. విద్యుత్ ఉత్పత్తికి ముందు రియాక్టర్ పనితీరును నిర్ధారించే ఈ అత్యంత కీలకమైన, తుది ఘట్టాన్ని భారతదేశం విజయవంతంగా అధిగమించి ప్రపంచ అణు శక్తి పటంలో తిరుగులేని శక్తిగా అవతరించింది.
**ప్రధాని మోదీ ప్రశంసలు..ఇదొక నిర్ణయాత్మక ముందడుగు**
ఈ చారిత్రక మైలురాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తూ శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. “భారత పౌర అణు ప్రయాణంలో ఇదొక నిర్ణయాత్మక ముందడుగు. మన అణు కార్యక్రమంలో సగర్వంగా రెండవ దశలోకి ప్రవేశించాం. కల్పక్కంలో దేశీయంగా రూపొందించి, నిర్మించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం మన శాస్త్రవేత్తల అసమాన సామర్థ్యానికి, మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతోంది” అని ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో దేశంలోని అపారమైన థోరియం నిల్వలను వినియోగించుకునే దిశగా ఇది ఒక బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు.
**అణు ఇంధన ‘అక్షయపాత్ర’…వాడే కొద్దీ పెరిగే ఇంధనం**
సాధారణ అణు రియాక్టర్లకు, ఈ ‘ఫాస్ట్ బ్రీడర్’ రియాక్టర్‌కు ఉన్న ప్రధాన వ్యత్యాసం అణుశాస్త్రంలో ఒక మాయాజాలాన్ని తలపిస్తుంది. మొదటి దశలోని ‘ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల’ నుంచి వెలువడే వ్యర్థ ఇంధనాన్ని రీప్రాసెస్ చేసి, దాని నుంచి తీసిన ప్లూటోనియంను ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌లో ఇంధనంగా వాడతారు. ఈ ప్రక్రియలో తాను వినియోగించుకునే దానికంటే అత్యధిక ఇంధనాన్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. ఫెర్టైల్ యురేనియం-238ను ఇది ప్లూటోనియం-239గా మారుస్తుంది. అందుకే ఈ రియాక్టర్‌ను ఇంధనాన్ని సృష్టించే ‘అక్షయపాత్ర’ గా అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మహంతి అభివర్ణించారు.
**అగ్రరాజ్యాలకు సాధ్యంకాని సాంకేతికత…రష్యా తర్వాత మనమే!**
ఈ సాంకేతికత ఎంత సంక్లిష్టమైనదంటే.. అమెరికా, జపాన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి అగ్రరాజ్యాలు సైతం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, భద్రతా కారణాలు, సాంకేతిక సవాళ్ల వల్ల ఈ ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేశాయి. కానీ, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ రూపకల్పనలో, ‘భావిని’ సంస్థ అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో దేశీయ పరిశ్రమల సహకారంతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ స్థాయిలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను విజయవంతంగా ఆపరేట్ చేస్తున్న రెండో దేశంగా రష్యా తర్వాత భారతదేశం మాత్రమే నిలవడం మన సాంకేతిక సార్వభౌమాధికారానికి నిదర్శనం.
**భాభా మూడంచెల కలకు సాకారం…థోరియం స్వర్ణయుగానికి నాంది**
డాక్టర్ హోమీ జహంగీర్ భాభా దార్శనికతతో రూపొందించిన ‘మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమం’లో ఈ కల్పక్కం విజయం రెండవ దశను అధికారికంగా ప్రారంభించింది. ఈ దశలో పుట్టే ఇంధనం, భవిష్యత్తులో మూడవ దశ అయిన ‘థోరియం ఆధారిత రియాక్టర్ల’కు ప్రాణం పోస్తుంది. ప్రపంచంలోని మొత్తం థోరియం నిల్వల్లో దాదాపు పాతిక శాతం (సుమారు 11.93 మిలియన్ టన్నులు) మన కేరళ తీరంలోని మోనజైట్ ఇసుకలో నిక్షిప్తమై ఉన్నాయి. కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ సృష్టించే మార్గంలో ఆ థోరియం నిల్వలను వినియోగించుకుంటే, వందల ఏళ్ల పాటు భారతదేశానికి విద్యుత్ కొరత అనే మాటే ఉత్పన్నం కాదు.
**క్లీన్ ఎనర్జీ దిశగా వడివడి అడుగులు…నూతన ‘శక్తి’ చట్టం అండ*
వాతావరణ మార్పులను అరికట్టే దిశగా 2070 నాటికి ‘నెట్ జీరో ఎమిషన్స్’ (కర్బన ఉద్గారాల రహిత) సాధించాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు వెన్నెముకగా నిలవనుంది. 2047 నాటికి దేశంలో ఏకంగా 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నది ప్రభుత్వ బృహత్తర లక్ష్యం. పబ్లిక్ సెక్టార్ నిధులతో పాటు, ఇటీవల సవరించిన చారిత్రాత్మక ‘శక్తి చట్టం’ ద్వారా ప్రైవేట్ రంగ పెట్టుబడులకు కూడా అణు విద్యుత్ రంగంలోకి ద్వారాలు తెరుచుకున్నాయి. తక్కువ కార్బన్ ఉద్గారాలతో, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు దేశ ఇంధన భద్రతలో గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి. కల్పక్కంలో వెలిగిన ఈ స్వదేశీ అణు జ్వాల కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఇంధన స్వయం సమృద్ధి దిశగా నవ భారత వేసిన ఒక వ్యూహాత్మక అంగ. జాతి యావత్తూ గర్వించదగ్గ మహత్తర ఘట్టమిది!








