Mahaa Daily Exclusive

  ఏసీబీ వలకి చిక్కిన వర్సిటీ అసోసియేట్‌ డీన్‌.. విత్తన లైసెన్స్‌ కోసం లంచం తీసుకుంటూ పట్టివేత..

Share

హైదరాబాద్, మహా.

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. అగ్రికల్చర్ కాలేజీలో అసోసియేట్ డీన్ (అగ్రోనమీ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. గోవర్ధన్‌ను లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక ప్రైవేట్ సంస్థకు విత్తన లైసెన్స్‌ మంజూరు చేసేందుకు, అలాగే వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి అడ్డంకులు కలగకుండా చూసేందుకు ఆయన భారీగా లంచం డిమాండ్ చేసినట్లు తేలింది.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఒక ఫిర్యాదుదారునికి చెందిన సంస్థకు సీడ్ లైసెన్స్ ఇప్పించేందుకు డాక్టర్ గోవర్ధన్ గతంలోనే రూ. 25,000 లంచం తీసుకున్నారు. అయితే, లైసెన్స్‌ ప్రక్రియ పూర్తి కావాలంటే అదనంగా మరో లక్ష రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు, మంగళవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ. 1,00,000 నగదును స్వీకరిస్తుండగా గోవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, గోవర్ధన్ ఎడమచేతి వేళ్లకు జరిపిన కెమికల్ టెస్టులో ఫలితం పాజిటివ్‌గా వచ్చినట్లు ధ్రువీకరించారు.

నిందితుడైన డాక్టర్ గోవర్ధన్‌ను అరెస్టు చేసిన అధికారులు, నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. తన విధులను దుర్వినియోగం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందేందుకు యత్నించిన ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా ఏసీబీ సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ కోరింది. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.