- యువతిపై సామూహిక అత్యాచారం.
- ఆపై నిర్దాక్షిణ్య హత్య.
వరంగల్,మహా.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మానవత్వం సిగ్గుతో తలవంచుకునే అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. రక్షణగా ఉండాల్సిన ఇల్లే ఆ యువతికి మృత్యుకూపంగా మారింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న నలుగురు కామాంధులు, ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై ఆనవాళ్లు దొరక్కుండా ఉరివేసి హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనతో రాయపర్తి మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడటమే కాకుండా, జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటగా, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సామాన్య ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు యువకులు అక్రమంగా చొరబడ్డారు. ఆమెపై విచక్షణారహితంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన సదరు మృగాళ్లు, బాధితురాలు ఎదురుతిరుగుతుందన్న భయంతోనో లేదా తమ నేరం బయటపడుతుందన్న ఉద్దేశంతోనో ప్రాణాలు తీసేందుకు వెనుకాడలేదు. గొంతు నులిమి ఉరివేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రాయపర్తి పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేటలోని మార్చురీకి తరలించారు.
అయితే, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు, నిందితులను కళ్లముందు ప్రవేశపెట్టే వరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనిచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. “న్యాయం కావాలి.. నిందితులను ఉరితీయాలి” అంటూ బాధితుల పక్షాన ఆందోళనకారులు చేసిన నినాదాలతో రహదారి మార్మోగిపోయింది. సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చట్టాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.








