Mahaa Daily Exclusive

  కమిషన్ల కక్కుర్తి కోసమే కొత్త ప్రాజెక్టులు..! మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం..

Share

  •  రైతు భూములను బలిపెట్టనివ్వం.
  •  మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం

వనపర్తి,మహా.

 

రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, కమిషన్ల కోసం ప్రాజెక్టులను నిర్మించాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత తన్నీరు హరీశ్‌ రావు హెచ్చరించారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన శిబిరానికి ఆయన చేరుకుని, వారికి సంఘీభావం తెలిపి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలమూరు గడ్డపై సాగునీటి కోసం తాము చేసిన యుద్ధాన్ని గుర్తు చేస్తూనే, ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు. ఈ పోరాటం కేవలం రాజకీయాల కోసం చేస్తున్నది కాదని, రైతుల గుండె కోతను ఆపాలనే సంకల్పంతో చేపట్టినదని ఆయన స్పష్టం చేశారు. ఒకరు దత్తత అని, మరొకరు వలసల జిల్లా అని కాలక్షేపం చేశారే తప్ప, పాలమూరు పచ్చబడటం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని మండిపడ్డారు.

గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో కేవలం 25 రిజర్వాయర్లు మాత్రమే నిర్మిస్తే, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తొమ్మిదేళ్లలోనే 65 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను పూర్తి చేసి చూపిందని హరీశ్‌ రావు గణంకాలతో వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సింహభాగం పనులను తామే పూర్తి చేశామని, కానీ చేతగాని ప్రభుత్వం మిగిలిన చిన్నపాటి పనులను కూడా పూర్తి చేయలేక కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఫలితంగా గత మూడు సీజన్లలో సుమారు 50 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీరు గనుక మన ప్రాజెక్టులలో ఉండి ఉంటే పాలమూరు ముఖచిత్రమే మారిపోయేదని పేర్కొన్నారు. గతంలో అడుగడుగునా కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకున్నది కాంగ్రెస్‌ నేతలేనని, ఇప్పుడు కాలువలు తీయడం చేతకాక కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హరీశ్‌ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఏదుల నుండే నేరుగా నీళ్లు పారే అవకాశం ఉన్నప్పుడు, ఈ రిజర్వాయర్ అవసరమే లేదని తాము ఆనాడే చెప్పామని గుర్తు చేశారు. కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే రైతుల భూములను లాక్కుని ఈ ప్రాజెక్టును రైతులపై రుద్దుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. జూరాల వద్ద ప్రాజెక్టు కట్టాలని సూచించే మేధావులకు కనీస అవగాహన లేదని, జూరాల ఆయకట్టుకు ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా వనపర్తికి నీళ్లు ఇప్పించిన ఘనత నిరంజన్ రెడ్డిదేనని, బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు పచ్చని రంగు వేసుకుందని పేపర్లలో హెడ్డింగ్‌లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలికొదిలేసి, పక్క రాష్ట్రాల్లో అబద్ధపు ప్రచారాలు చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెల్లిందని హరీశ్‌ రావు విమర్శించారు. “ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత” అన్నట్లుగా ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక, కేరళకు వెళ్లి అన్నీ చేసేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. నాలుగు విడతల రైతుబంధును ఎగ్గొట్టిన ప్రభుత్వం, రుణమాఫీ పేరుతో ప్రజలను వంచిస్తోందని ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లాలో ఏ గ్రామానికైనా వెళ్దామని, అక్కడ రుణమాఫీ వంద శాతం పూర్తయినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని బహిరంగ సవాల్ విసిరారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చి, రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతారని, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రైతుల భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.

Latest