- కేసీఆర్‌కు లీగల్ నోటీసుల కలకలం!
- అంగన్‌వాడీ ఫోన్ల రగడ..
- 44 కోట్ల టెండర్‌లో 30 కోట్ల స్కామా?
- ప్రతిష్ట దెబ్బతీస్తే ఊరుకోం.. క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ చర్యలు తప్పవు.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు న్యాయపోరాటంగా రూపుదాల్చింది. అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆమె లీగల్ నోటీసులు పంపారు. మంత్రి సీతక్క తరపు న్యాయవాది నాగులూరి కృష్ణకుమార్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ నోటీసులను కేసీఆర్‌కు పంపడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు, అసత్య ప్రచారాలకు దారితీస్తున్న తరుణంలో సీతక్క తీసుకున్న ఈ నిర్ణయం గులాబీ దళంలో కలకలం రేపుతోంది.
**అసంబద్ధ ఆరోపణలు.. అసలు వాస్తవమిదీ!**
మంత్రి పంపిన నోటీసులో ప్రధానంగా అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియపై జరుగుతున్న ప్రచారాన్ని ఎండగట్టారు. అసలు మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా అత్యంత పారదర్శకంగా జరిగిందని ఆమె స్పష్టం చేశారు. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ దక్కిందని, ఇందులో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె నోటీసులో కుండబద్దలు కొట్టారు. మొత్తం టెండర్ విలువే కేవలం రూ. 44 కోట్లు కాగా, అందులో ఏకంగా రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని బిఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హాస్యాస్పదమని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా చేస్తున్న ఇటువంటి ఆరోపణలు తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
**డెడ్‌లైన్ ఫిక్స్.. లేదంటే కోర్టుకే!**
బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ కుట్రపూరిత ప్రచారానికి ఆ పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. వచ్చే 48 గంటల్లోగా సోషల్ మీడియాలోని ఆ అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించడమే కాకుండా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. నిర్ణీత సమయంలోగా స్పందించకుంటే సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి, ఇటువంటి అసత్య ఆరోపణలతో బురదజల్లడం సరికాదని ఆమె హితవు పలికారు. జగిత్యాల సభకు సిద్ధమవుతున్న కేసీఆర్‌కు ఈ లీగల్ నోటీసు రూపంలో సీతక్క ముందే పెద్ద షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.







