Mahaa Daily Exclusive

  చర్లపల్లి ఆత్మహత్యల మిస్టరీలో ‘బిగ్ ట్విస్ట్’.

Share

  •  అత్తింటిపై భర్త సురేందర్ రెడ్డి రివర్స్ అటాక్!
  •  నా పెళ్లాం, పిల్లలు పిరికివాళ్లు కాదు.. వాళ్లే బలితీసుకున్నారు.
  • పోలీసులను ఆశ్రయించిన భర్త!
  • హైదరాబాద్, మహా.

మూడు నెలల క్రితం చర్లపల్లిలో రైలు కిందపడి ఇద్దరు చిన్నారులతో సహా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఆ మరణాలను ‘ఒంటరితనం, మానసిక ఒత్తిడి’ ఖాతాలో వేసి మమ అనిపించిన పోలీసులకు, విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు మైండ్ బ్లాక్ చేస్తోంది. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ‘అన్యోన్యంగా ఉన్నాం’ అని చెప్పిన సురేందర్ రెడ్డి, ఇప్పుడు ఒక్కసారిగా తన అత్తింటిపైనే యుద్ధం ప్రకటించడం ఈ కేసును మలుపు తిప్పింది. తన భార్యాపిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదని, తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి చేసిన వేధింపులే వారి మరణానికి కారణమని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

**ఆస్తి కాంక్షే ‘ఆహుతి’ తీసుకుందా?**

సురేందర్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం.. విజయారెడ్డి మరణం వెనుక అసలు కారణం ఆస్తి గొడవలే. నమ్మిన వాళ్లే తన సంసారాన్ని చిన్నాభిన్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాబిడ్డలు పోయి తాను పుట్టెడు దుఃఖంలో ఉంటే, వారు చనిపోయిన కేవలం 25 రోజులకే ఆస్తి కోసం అత్తింటి వారు తనను బెదిరించడం మొదలుపెట్టారని ఆయన సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన భార్యను మానసికంగా వేధించి, ప్రాణాలు తీసుకునే స్థితికి దిగజార్చింది తన అత్త, బావమరిదిలేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆస్తి కోసం కన్న కూతురిని, మనవళ్లను కూడా చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టారన్న వాదన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.

**ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి!**

తనకు అత్తింటి వారి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి పోలీసులను వేడుకున్నారు. “ఒకవేళ నాకు ఏమైనా జరిగితే నా ఆస్తి మొత్తం నా తల్లిదండ్రులకు, ఒక ట్రస్ట్‌కు చెందాలి తప్ప.. ఆ ద్రోహులకు ఒక్క రూపాయి కూడా దక్కకూడదు” అని ఆయన ఇప్పటికే వీలునామా రాసినట్లు సమాచారం. సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారని, తన భార్య ప్రాణాలు తీసుకునేలా పరిస్థితులను సృష్టించారని ఆయన ఆరోపించారు. విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె వద్ద లభించిన వివరాల కంటే, ఇప్పుడు సురేందర్ రెడ్డి బయటపెడుతున్న వాస్తవాలు ఈ కేసును సరికొత్త కోణంలోకి తీసుకెళ్లాయి.

**పోలీసుల దర్యాప్తు ఎటువైపు?**

మొదట్లో దీనిని సాధారణ ఆత్మహత్యగా భావించి కేసును క్లోజ్ చేసే పనిలో ఉన్న పోలీసులకు, ఇప్పుడు ఈ ఫిర్యాదు కొత్త సవాల్‌గా మారింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి నిజంగానే మానసిక ఒత్తిడితో చనిపోయిందా? లేక భర్త ఆరోపిస్తున్నట్లుగా అత్తింటి వారి వేధింపులే ఆమెను బలితీసుకున్నాయా? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఇద్దరు బిడ్డలను చంపి తాను చనిపోవడం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇప్పుడు అత్త, బావమరిది చుట్టూ తిరుగుతోంది. నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఈ ఆస్తి వివాదం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Latest