Mahaa Daily Exclusive

  ఫలితాల వేళ తీరని విషాదం.. క్షణికావేశంలో ఏడుగురు విద్యార్థుల బలి..

Share

హైదరాబాద్, మహా.

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లువ అనేక కుటుంబాల్లో ఆనందాన్ని నింపగా, మరికొన్ని ఇళ్లలో కోలుకోలేని శోకాన్ని మిగిల్చింది. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న ఆవేదన, ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చిన్న వయసులోనే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆయా కుటుంబాల్లో చీకట్లు నింపాయి.

నగరంలోని వారసిగూడకు చెందిన కళ్యాణి(16), నాచారానికి చెందిన లక్ష్య(16) అనే విద్యార్థినులు ఫలితాలు చూసుకున్న తర్వాత తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నారు. అటు మెదక్ జిల్లాలోనూ విషాదం అలుముకుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన సాయిరాం(16) పరీక్ష తప్పానన్న బాధతో తనువు చాలించాడు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి చెందిన సౌజన్య(17) కూడా ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను కలచివేసింది.

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో శ్రావణి(17) అనే విద్యార్థిని, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన మరో సౌజన్య(17) కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో తమ తోటి విద్యార్థుల ముందు చిన్నబోతామన్న భయంతో, ఆవేదనతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. అటు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ గ్రామంలో అభియాదవ్ అనే విద్యార్థి కూడా ఇదే దారిని ఎంచుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఒకే రోజు ఏడుగురు విద్యార్థులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదని, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని విద్యావేత్తలు కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇటువంటి సమయంలో పిల్లలకు అండగా నిలవాలని, మార్కుల కంటే ప్రాణాలు విలువైనవని భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిదిమిన పువ్వుల్లా రాలిపోయిన ఈ విద్యార్థుల మరణాలతో ఆయా గ్రామాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.

Latest