Mahaa Daily Exclusive

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్..! ఏప్రిల్ 22 నుంచి నిరవధిక సమ్మెకు జేఏసీ సన్నద్ధం..

Share

  • ఏప్రిల్ 22 నుంచి నిరవధిక సమ్మెకు జేఏసీ సన్నద్ధం.
  • 32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి.
  •  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబట్టిన కార్మిక సంఘాలు.

హైదరాబాద్, మహా .

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ)లో మరోసారి సమ్మె సెగ రాజుకుంది. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 22వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. గత నెల 13వ తేదీనే సమ్మె నోటీసులు అందజేసినప్పటికీ, అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇటు సంస్థ యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

సమ్మె నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ, కార్మికుల పక్షాన మొత్తం 32 డిమాండ్లతో కూడిన నివేదికను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జేఏసీ గట్టిగా వినిపిస్తోంది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని జేఏసీ వైస్‌ఛైర్మన్‌ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీటితో పాటు కార్మిక సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించాలని కోరారు.

మరో పది రోజుల్లో సమ్మె ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరపాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉందని జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వం స్పందించి డిమాండ్లను నెరవేరిస్తేనే సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటామని, అంతవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్మిక సంఘాల నేతలు భీష్మించుక కూర్చున్నారు. ఈ సమ్మె ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Latest