Mahaa Daily Exclusive

  పునర్విభజనపై ‘హైబ్రిడ్‌ మోడల్‌’ కావాలి..! ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి డిమాండ్‌..

Share

  • జనాభాతో పాటు జీఎస్‌డీపీని ప్రాతిపదికగా తీసుకోవాలి.
  •  దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించం.
  • మహిళా రిజర్వేషన్లకు మా సంపూర్ణ మద్దతు.
  • కానీ దాన్ని పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదు.
  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి డిమాండ్‌.

హైదరాబాద్‌, మహా.

 

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు మరియు పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. నియోజకవర్గాల పెంపు అనేది కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ‘జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్’లో జరగాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు కేవీ కేశవరావు , ఎంపీలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక ప్రతిపాదనలను వివరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, అయితే మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి తెరపైకి తీసుకురావడం దేశ రాజకీయ సమగ్రతకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మనుగడకు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన విధానం ప్రకారం నియోజకవర్గాలను పెంచితే ఉత్తర మరియు దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ అంతరం భారీగా పెరిగిపోతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాలకు అదనంగా మరో 50 శాతం సీట్లను పెంచాలని కేంద్రం భావిస్తోందని, అంటే అదనంగా వచ్చే 272 స్థానాల్లో శాస్త్రీయత ఉండాలని ఆయన సూచించారు. ఇందులో 136 సీట్లను ప్రొరేటా (జనాభా దామాషా) ప్రకారం కేటాయించి, మిగిలిన 136 సీట్లను ఆయా రాష్ట్రాలు జాతీయ స్థూల ఉత్పత్తికి (GSDP) అందిస్తున్న వాటా ప్రాతిపదికన విభజించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దేశాభివృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చుతూ, అత్యధిక భాగస్వామ్యం కలిగి ఉన్న రాష్ట్రాలకు ఈ హైబ్రిడ్ మోడల్ ద్వారా తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన విశ్లేషించారు. కేవలం జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించడం సరికాదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు నియోజకవర్గాల పెంపు బిల్లును కూడా హడావిడిగా ఆమోదించే ప్రయత్నం జరుగుతోందని, ఈ రెండింటినీ ఒకటిగా చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన అనేవి పూర్తిగా భిన్నమైన అంశాలని, ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చినప్పుడు తాము మద్దతు ఇచ్చామని, 2026 జనాభా లెక్కల తర్వాతే అమలు చేస్తామన్న అడ్డంకిని అప్పుడే తొలగించి ఉంటే ఈపాటికి దేశవ్యాప్తంగా వందలాది మంది మహిళలు చట్టసభలకు ఎన్నికై ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, కానీ నియోజకవర్గాల పెంపు విషయంలో మాత్రం అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కేంద్రం తాజా ప్రతిపాదనల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎంతలా నష్టపోతాయో రేవంత్ రెడ్డి గణంకాలతో సహా వివరించారు. ఉదాహరణకు కేరళలో ప్రస్తుతం ఉన్న 20 స్థానాలను 50 శాతం పెంచితే అవి 30కి చేరుతాయని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని 80 స్థానాలు 120కి పెరుగుతాయని, దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం 90 స్థానాలకు చేరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే ఇప్పుడున్న వ్యత్యాసం కంటే అదనంగా మరో 94 సీట్ల అంతరం పెరుగుతుందని వివరించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని 413 సీట్లు 621కి పెరగడం వల్ల దక్షిణాది రాజకీయంగా అట్టడుగున పడిపోతుందని, చిన్న రాష్ట్రాలు కేవలం ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆర్థిక రాజధానులుగా ఉంటూ ఆదాయాన్ని, ఉద్యోగాలను కల్పిస్తుంటే, ఉత్తరాది రాష్ట్రాలు కేవలం రాజకీయ రాజధానులుగా మారి అధికారాన్ని చెలాయించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.

ఈ సున్నితమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా విధివిధానాలు ఖరారు చేయాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. నియోజకవర్గాల పెంపుపై ఒక నిపుణుల కమిటీని నియమించి, ఆ కమిటీ నివేదికపై పార్లమెంటులో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈశాన్య రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్ల కేటాయింపు కేవలం జనాభా ప్రాతిపదికన జరగలేదని, అక్కడ ప్రాతినిధ్యానికి విలువ ఇచ్చారని గుర్తు చేస్తూ, దక్షిణాది విషయంలో కూడా అదే రీతిన ఆలోచించాలని కోరారు. ఈ గందరగోళానికి తెర దించేందుకు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్న ఇలాంటి నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదని, 2028 నాటికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి, ఆలోగా ఏకాభిప్రాయం సాధించాలని ముఖ్యమంత్రి హితబోధ చేశారు.