- డిస్కమ్‌లకు రూ.14వేల కోట్ల మంజూరు.
- రైతులకు అండగా విద్యుత్ టారిఫ్ సబ్సిడీ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని వ్యవసాయ రంగం అభివృద్ధికి, అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సాగు , దాని అనుబంధ రంగాలకు అందిస్తున్న రాయితీ విద్యుత్తు సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు భారీ ఎత్తున నిధులను కేటాయించింది.
ఈ క్రమంలో, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.14,000,00,01,000 (పద్నాలుగు వేల కోట్ల ఒక వెయ్యి రూపాయలు) మంజూరు చేస్తూ ఇంధన శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిధులను రాష్ట్రంలోని రెండు ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థలైన టీజీఎస్పీడీసీఎల్ (దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) , టీజీఎన్పీడీసీఎల్ (ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) కు కేటాయించారు. మంజూరైన ఈ భారీ మొత్తాన్ని ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమయ్యే ప్రతి నెలా సమాన వాయిదాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం, ప్రతి నెలా రూ. 1,166.67 కోట్ల చొప్పున డిస్కమ్‌లు తమ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ నిధుల విడుదల వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టం కావడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, లైన్ల మరమ్మతులు వంటి అంశాల్లో జాప్యం లేకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు.
సాంకేతికంగా ఈ నిధులను ‘అసిస్టెన్స్ టు ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సబ్సిడీ’ పథకం కింద టీజీ ట్రాన్స్‌కోకు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఈ మొత్తం నిధులను హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ శాఖలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ‘టీజీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పూల్ అకౌంట్’ లో ఈ సొమ్మును జమ చేయడం ద్వారా, డిస్కమ్‌ల ఆర్థిక అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు వీలు కలుగుతుంది. సాధారణంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందించడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం ఈ సబ్సిడీ నిధుల రూపంలో భర్తీ చేస్తూ వస్తోంది. ఈ సకాలంలో నిధుల విడుదల వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు (Gencos) చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో తీర్చడానికి, అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను నిలబెట్టుకోవడానికి డిస్కమ్‌లకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.
ప్రస్తుత వేసవి కాలంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ముందుచూపుతో ఈ నిధులను కేటాయించడం గమనార్హం. కేవలం సాగు రంగమే కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఈ టారిఫ్ సబ్సిడీ వర్తిస్తుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఉతమ్నని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో విద్యుత్ శాఖాధికారులు నిధుల క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ మాసానికి సంబంధించిన మొదటి విడత నిధులు త్వరలోనే పూల్ అకౌంట్ లో జమ కానున్నాయి. రైతులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం క్షేత్రస్థాయిలో సాగు విస్తీర్ణం పెరగడానికి మరియు దిగుబడులు ఆశాజనకంగా ఉండటానికి దోహదపడనుంది. మొత్తానికి, భారీ బడ్జెట్ కేటాయింపులతో ఇంధన రంగంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం.








