రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయే.
*కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర విరక్తి.
*మహిళా రిజర్వేషన్లతో నవశకానికి నాంది.
* వరంగల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు రామచంద్రరావు స్పష్టీకరణ.
వరంగల్, మహా.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలన పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర విరక్తితో ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు రామచంద్రరావు స్పష్టం చేసింది. బుధవారం వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక ప్రజా సమస్యలపై వారు మాట్లాడారు. వేగవంతమైన అభివృద్ధి, పారదర్శకమైన సుపరిపాలన కేవలం బీజేపీ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’తోనే సాధ్యమని, అందుకే రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యామ్నాయంగా తమ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూనే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
చారిత్రాత్మక ‘నారీ శక్తి వందన్ అధినియం’ ద్వారా లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరపున నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 76 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మక అడుగు అని అభివర్ణించారు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, “మహిళల అభివృద్ధి” స్థాయి నుండి “మహిళా నేతృత్వంలోని అభివృద్ధి” దిశగా దేశాన్ని నడిపించే ఒక గొప్ప మలుపు అని కొనియాడారు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నాయని వారు మండిపడ్డారు. డీలిమిటేషన్ కమిషన్ ద్వారా జనాభా దామాషా పద్ధతిలోనే అత్యంత పారదర్శకంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఇందులో ఎలాంటి కుట్రలకు తావులేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నాయని, వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
వరంగల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.








