Mahaa Daily Exclusive

  టీజీ20′ లీగ్‌పై అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు…

Share

* తప్పుడు ప్రచారాలపై హెచ్‌సీఏ ఫైర్.
* గుర్తింపు లేని సంస్థల ఆరోపణలు బుకాయింపే.
*తెలంగాణలో క్రికెట్ నిర్వహణకు ఏకైక అధికారిక సంస్థ మాదే..
* తేల్చి చెప్పిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.
*మా కార్యకలాపాలపై ఏ కోర్టు ఆంక్షలు విధించలేదు. *న్యాయపరమైన వాస్తవాలను వెల్లడించిన హెచ్‌సీఏ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి అధికారిక గుర్తింపు లేని కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను, ఆధారరహిత ఆరోపణలను హెచ్‌సీఏ తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా రాష్ట్రంలో తాము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘టీజీ20’ లీగ్ సహా ఇతర చట్టబద్ధమైన కార్యకలాపాలపై గందరగోళం సృష్టించేందుకు కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ ఆదివారం ఒక అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
**క్రికెట్ నిర్వహణలో ఏకైక గుర్తింపు మాదే..**
తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ వ్యవహారాలను పాలించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గుర్తించిన ఏకైక అధికారిక సంస్థ హెచ్‌సీఏ మాత్రమేనని స్పష్టం చేసింది. 1934 నుంచి బీసీసీఐ వ్యవస్థాపక సభ్యునిగా ఉన్న తమకు.. గౌరవ సుప్రీంకోర్టు సమర్థించిన “ఒక రాష్ట్రం-ఒక సభ్యుడు” సూత్రం ప్రకారం పూర్తి అధికారాలు ఉన్నాయని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదా అధికారం వేరే ఏ ఇతర అనామక సంస్థకూ లేదని తేల్చిచెప్పింది.
**చట్టపరమైన చర్యలు తప్పవు!**
రాష్ట్రంలో క్రికెట్‌కు సంబంధించిన అన్ని చట్టపరమైన, పరిపాలనాపరమైన వ్యవహారాలను నిర్వహించే పూర్తి సామర్థ్యం తమకుందని హెచ్‌సీఏ ఉద్ఘాటించింది. పరోక్ష బెదిరింపులకు, స్వార్థపూరిత ఆరోపణలకు తాము ఏమాత్రం భయపడేది లేదని స్పష్టం చేసింది. ఆటగాళ్లను, వాటాదారులను లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టు కేసుల గురించి చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని, బాంబే హైకోర్టు గానీ, మరే ఇతర న్యాయస్థానం గానీ తమ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆయా అనామక సంస్థలకు ఎలాంటి ఊరట ఇవ్వలేదని స్పష్టం చేసింది.
**గ్రాస్‌రూట్ క్రికెట్ కోసమే ‘టీజీ20’ లీగ్..**
‘టీజీ20’ (TG20) లీగ్ అనేది బీసీసీఐ నిబంధనలకు లోబడి, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న ఒక అధికారిక టోర్నమెంట్ అని హెచ్‌సీఏ వెల్లడించింది. క్షేత్రస్థాయి (గ్రాస్‌రూట్) నుంచి క్రికెట్‌ను బలోపేతం చేయడం, తెలంగాణ నలుమూలల ఉన్న యువ క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా ఈ లీగ్‌ను తీసుకొచ్చినట్లు వివరించింది. పారదర్శక పాలన, చట్టబద్ధమైన పనితీరు, రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని హెచ్‌సీఏ తెలిపింది. బీసీసీఐ చట్రంలో, చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తూనే.. తెలంగాణలో క్రికెట్ పరిపాలనను అస్థిరపరిచే కుట్రలను అడ్డుకుని, క్రీడా సమగ్రతను కాపాడతామని అసోసియేషన్ పునరుద్ఘాటించింది.