Mahaa Daily Exclusive

  తిరుప్పరంకుండ్రం కార్తీక దీపంపై వివాదం.

Share

  •  బీజేపీ నేతల అడ్డుకట్ట, భారీ బందోబస్తు.

చెన్నై, మహా.

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సుమారు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న దీపస్తంభం వివాదం తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి తెరపైకి వచ్చింది. నవంబర్ 24న కొండపై ఉన్న దీపస్తంభం వద్ద సంప్రదాయబద్ధంగా దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ విమర్శలు, పోలీసుల ఆంక్షలు తీవ్రతరమయ్యాయి. కోర్టు ఆదేశాల అమలును పరిశీలించేందుకు తిరుప్పరంకుండ్రం వెళ్లాలని ప్రయత్నించిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను పోలీసులు అడ్డుకోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

సుప్రీంకోర్టులో దీపం వెలిగింపుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై నైనార్ నాగేంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరునెల్వేలిలో తనను గృహనిర్బంధం చేశారని, కార్తీక దీపం సందర్భంగా తిరుప్పరంకుండ్రం వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలను నిర్బంధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారని పేర్కొన్నారు.

తిరుప్పరంకుండ్రం కొండకు వెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాల అమలు తీరును పరిశీలించాలనుకున్న తనను పోలీసులు అడ్డుకున్నారని నాగేంద్రన్ తెలిపారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు హిందూ మున్నాని సంస్థకు చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శివగంగ జిల్లాలోనూ హిందూ మున్నాని నేతలు, కార్యకర్తలను నిర్బంధించారు.

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మధురై జిల్లా యంత్రాంగం నవంబర్ 23 రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 25 ఉదయం 10 గంటల వరకు నిషేధాజ్ఞలు విధించింది. బహిరంగ సభలు, ర్యాలీలు, అనుమతి లేకుండా కొండపైకి వెళ్లడాన్ని నిషేధించింది. అయితే సంప్రదాయ పూజలు, ఆలయ నిత్యకైంకర్యాలు, దర్గాకు చట్టబద్ధంగా వెళ్లడం, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చింది. కొండ పరిసరాల్లో 5,618 మంది పోలీసులను మోహరించడంతో పాటు 70కి పైగా సీసీటీవీ, ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు డ్రోన్ల వినియోగంపైనా ఆంక్షలు విధించారు.

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలన్న డిమాండ్ హిందూ సంఘాలు, భక్తుల నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా వినిపిస్తోంది. కొండ దిగువన సుబ్రమణ్యస్వామి ఆలయం, పైభాగంలో దర్గా ఉండటంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. దీపం వెలిగించాలనుకుంటున్న రాతి స్తంభం ఆలయానికి చెందినదని హిందూ సంఘాలు వాదిస్తుండగా, దర్గా సమీపంలో దీపం వెలిగించడంపై దర్గా వర్గాలు, ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వివాదంపై నవంబర్ 20న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, నవంబర్ 24న దీపస్తంభం వద్ద సంప్రదాయబద్ధంగా ఒకసారి దీపం వెలిగించేందుకు అనుమతించింది. ఈ కార్యక్రమాన్ని అధీకృత బృందమే నిర్వహించాలని స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సాధారణ ప్రజలు, ఊరేగింపులు, గుంపులుగా కొండపైకి వెళ్లడంపై పరిమితులు విధించింది. దీంతో కోర్టు ఆదేశాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల చర్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ తీవ్రతరమైంది. ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన అంశం రాజకీయ వివాదంగా మారడంతో తమిళనాట పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి.