Mahaa Daily Exclusive

  భార్యతో విడాకులకు సిద్ధమైన దళపతి విజయ్‌….

Share

 

* రూ. 250 కోట్లు డిమాండ్ చేసిన సంగీత.

* రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ అంగీకారం.

*నేడు కోర్టులో విచారణ.. ఆన్‌లైన్ ద్వారా హాజరుకానున్న టీవీకే అధ్యక్షుడు.

*చెన్నైలోని నీలాంగరై ఇంట్లో ఉండేందుకు అనుమతివ్వాలని సంగీత పిటిషన్.

చెన్నై మహా.

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సంగీత ఇప్పటికే విజయ్‌ నుంచి విడాకులు కావాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం (ఈనెల 20న) చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో, పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు ఇరు పక్షాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శనివారం చెన్నైలో ఇద్దరి లాయర్ల మధ్య సెటిల్‌మెంట్ చర్చలు జరిగినట్లు సమాచారం.

 

**సెటిల్‌మెంట్ వివరాలు..**

 

ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో విజయ్‌ పొందుపరిచిన ఆస్తుల వివరాల ప్రాతిపదికన.. తనకు భరణంగా రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తనతో పాటు కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్‌మెంట్‌ ఇవ్వాలని ఆమె కోరారు. అయితే, భార్య సంగీతకు మాత్రం రూ.35 కోట్లు సెటిల్‌మెంట్‌ కింద ఇచ్చేందుకు విజయ్‌ అంగీకరించినట్లు సమాచారం. అలాగే, పిల్లలిద్దరి (కుమారుడు, కుమార్తె) బాధ్యతలను తానే చూసుకుంటానని విజయ్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

**ఆన్‌లైన్‌లో హాజరుకానున్న విజయ్..**

సంగీత, విజయ్‌ల విడాకుల వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌ చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. వాస్తవానికి ఈ విచారణకు విజయ్‌ స్వయంగా హాజరవ్వాలని కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాను ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో అత్యంత బిజీగా ఉన్నందున సోమవారం నాటి విచారణకు ఆన్‌లైన్‌ ద్వారా (వర్చువల్‌గా) హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయ్‌ తరఫు న్యాయవాదులు ఈనెల 17న ఒక పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు సంగీత సైతం కోర్టులో ఒక మధ్యంతర పిటిషన్‌ వేశారు. విడాకుల కేసు పూర్తిగా ముగిసే వరకు.. చెన్నై నీలాంగరైలో ఉన్న విజయ్‌ ఇంట్లోనే తాను ఉండేందుకు అనుమతివ్వాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై కూడా కోర్టు సోమవారమే విచారణ చేపట్టనుంది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇచ్చి కీలక దశలో ఉన్న విజయ్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలవడం తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.