* సముద్ర గర్భంలో మహా ప్రళయం..
* పొంచి ఉన్న సునామీ ముప్పు.
టోక్యో,మహా.
సూర్యుడు అస్తమిస్తున్న వేళ జపాన్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న పసిఫిక్ సముద్ర గర్భంలో సోమవారం సాయంత్రం మహా ప్రళయం బద్దలైంది. ఉత్తర ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలో సముద్ర గర్భంలో పది కిలోమీటర్ల లోతున సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం జపాన్ తీరాన్ని తీవ్రంగా వణికించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రాథమికంగా దీని తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.4గా అంచనా వేయగా, అది 7.5గా ఉండొచ్చని తర్వాత సవరించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాలకు భూమి అమాంతం కంపించడంతో ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని టోక్యో నగరంలో సైతం ఆకాశహర్మ్యాలు పెద్దఎత్తున ఊగిపోవడం ఈ భూకంప తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ మహా భూకంపం వెనువెంటనే జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సముద్రపు అలలు పది అడుగుల (మూడు మీటర్ల) మేర ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదం పొంచి ఉండటంతో ఇవాటే, ఆమోరి, హోక్కైడో ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించి, అత్యవసర సునామీ హెచ్చరికలు జారీ చేశారు. టెలివిజన్ తెరల నిండా ‘తక్షణమే ప్రాణాలు కాపాడుకోండి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి’ అనే సందేశాలు నిరంతరాయంగా ప్రసారం అవుతున్నాయి. తీరప్రాంతాలు, నదీ తీరాల వెంబడి నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎత్తైన కొండలు, పటిష్టమైన భవనాలపైకి చేరుకోవాలని యంత్రాంగం కఠిన ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలలు ఒకదాని తర్వాత ఒకటి విరుచుకుపడే అవకాశం ఉన్నందున, హెచ్చరికలు అధికారికంగా ఉపసంహరించే వరకూ ఎవరూ కిందకు రావొద్దని విపత్తు నిర్వహణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా టోక్యో, ఆమోరి నగరాల మధ్య రాకపోకలు సాగించే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు (షింకన్సెన్) సర్వీసులకు ఎక్కడికక్కడ బ్రేకులు వేశారు. మరోవైపు, తీరంలో లంగరు వేసిన నౌకలు సునామీ అలల తాకిడికి ధ్వంసం కాకుండా ఉండేందుకు హచినోహే తదితర కీలక ఓడరేవుల నుంచి నడిసముద్రం లోపలికి తరలిస్తున్నారు. విపత్తు తీవ్రతను అంచనా వేసిన జపాన్ ప్రధానమంత్రి సనే తకైచి హుటాహుటిన ఒక అత్యవసర టాస్క్ఫోర్స్ను రంగంలోకి దించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని, ప్రాణనష్టం జరగకుండా అన్ని యంత్రాంగాలను సమన్వయం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనల నడుమ క్షణాలు గడుపుతున్నారు.







