Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని పరామర్శించిన ఎంపీ ఈటల ….

Share

* అపోలోలో జి.ఎం.ఆర్‌ ఆరోగ్యంపై ఆరా.
* ప్రజాసేవలోకి త్వరగా తిరిగి రావాలి.
హైదరాబాద్, మహా.

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిపాల్ రెడ్డిని ఈటల రాజేందర్ స్వయంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డికి అందుతున్న వైద్య సేవల గురించి అక్కడి వైద్యులతో కూడా ఈటల చర్చించారు. నియోజకవర్గంలో నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడు మహిపాల్ రెడ్డి అని, ఆయన భగవంతుని కృపతో సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. త్వరలోనే ఆయన తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ పరామర్శలో భాగంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కూడా ఈటల మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మహిపాల్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిసింది. పటాన్‌చెరు నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన జి.ఎం.ఆర్ ఆసుపత్రిలో చేరారన్న వార్తతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఈటల వంటి అగ్రనేతలు పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో ఎంతో సన్నిహితంగా ఉండే వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది.