Mahaa Daily Exclusive

  ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షాక్‌…

Share

* షోకాజ్ నోటీసులు జారీ.
* అనుమతి లేకుండా జగన్‌కు ఆశీర్వచనం..
* నిబంధనల ఉల్లంఘనపై అధికారుల ఆగ్రహం
* రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం..
* పులివెందుల పర్యటనపై డీఈఓ సీరియస్‌
కడప, మహా.
వైఎస్సార్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ అర్చకుల తీరుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మర్యాదలను అతిక్రమించి, అధికారుల నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా రాజకీయ పర్యటనలు చేయడంపై ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అర్చకులు ఎ. శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె. పార్థసారథిలు తమ ప్రవర్తనపై రెండు రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారి (డీఈఓ) ఎ. ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం ఇప్పుడు ఆధ్యాత్మిక, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
అనుమతి లేని ఆశీర్వచనం.. వివాదానికి కారణం
వివరాల్లోకి వెళ్తే.. సదరు అర్చకులు ఇటీవల పులివెందులకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు వేద ఆశీర్వచనాలతో పాటు శ్రీరాముని శేష వస్త్రం, తోమాల సేవలో వినియోగించిన పూలమాలలు, అత్యంత పవిత్రమైన ముత్యాల తలంబ్రాలను అందజేశారు. సాధారణంగా టీటీడీ పరిధిలోని ఆలయాలకు సంబంధించి ఇటువంటి అధికారిక ఆశీర్వచనాలు లేదా పవిత్ర ప్రసాదాలను ప్రముఖులకు అందజేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. అయితే, ఈ అర్చకులు అత్యుత్సాహం ప్రదర్శించి, ఎటువంటి అనుమతులు లేకుండానే పులివెందుల సేవలో తరించడంపై టీటీడీ యంత్రాంగం గుర్రుగా ఉంది. ఆలయ నిబంధనలను తుంగలో తొక్కడం క్రమశిక్షణారాహిత్యమేనని అధికారులు భావిస్తున్నారు.
కఠిన చర్యలకు రంగం సిద్ధం?
పవిత్రమైన ఆలయ సంప్రదాయాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా రాజకీయ నాయకుల ప్రీతి కోసం వినియోగించడం సరికాదని భక్తుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఈఓ ప్రశాంతి ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నోటీసులు అందుకున్న అర్చకుల నుంచి వచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఒకవేళ వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే, విధుల్లో నుంచి తొలగించడం లేదా ఇతర కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆలయ గౌరవ ప్రతిష్టలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.