* 4 టన్నుల నకిలీ టీ పౌడర్ స్వాధీనం.
* వాడిన టీ పొడికే రంగులు అద్ది విషంగా మారుస్తున్న కేటుగాళ్లు.
* 10 మంది నిందితుల అరెస్ట్.
* హెచ్-ఫాస్ట్ పోలీసుల రహస్య ఆపరేషన్.
* కల్తీ మాంసం తర్వాత టీ పొడి గుట్టురట్టు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరాన్ని వరుస కల్తీ దందాలు వణికిస్తున్నాయి. ఆహార పదార్థాల నాణ్యతను గాలికొదిలేసి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాల పని పట్టేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక రహస్య ఆపరేషన్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన అధికారులు, సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. టీ ప్రియుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ సాగుతున్న ఈ అక్రమ దందాలో భాగస్వాములైన 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విషతుల్యంగా మారుస్తున్న వైనం..
ఈ ముఠా అనుసరిస్తున్న తీరు పోలీసులనే విస్మయానికి గురిచేసింది. హోటళ్లు, టీ షాపుల నుంచి వాడి పారేసిన టీ పొడిని సేకరించి, దాన్ని ఎండబెట్టి మళ్లీ వినియోగంలోకి తెస్తున్నట్లు విచారణలో తేలింది. కేవలం ఎండబెట్టడమే కాకుండా, దానికి చిక్కటి రంగు, వాసన వచ్చేందుకు అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ రంగులను, కృత్రిమ రసాయనాలను కలుపుతున్నారు. ఈ కల్తీ పొడిని తక్కువ ధరకు కొంతమంది టీ షాప్ యజమానులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల కాలేయం, కిడ్నీ వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది టీ కొట్టుల యజమానులు లాభాపేక్షతో తెలిసి కూడా ఈ కల్తీ పొడిని వాడుతుండటం గమనార్హం.
హెచ్-ఫాస్ట్ దూకుడు.. వరుస దాడులు
నగరంలో కల్తీ మాఫియా గుండెల్లో ‘హెచ్-ఫాస్ట్’ విభాగం రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్‌ను పట్టుకుని సంచలనం సృష్టించిన ఈ విభాగం, ఇప్పుడు టీ పొడి దందాను బయటపెట్టడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో, రహస్య సమాచారంతో దాడులు నిర్వహిస్తుండటంతో అక్రమార్కుల ఆటలు సాగడం లేదు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడబోమని, కల్తీకి పాల్పడే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న దుకాణాలపై నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.








