- డిపోలు దాటని బస్సులు
- తప్పని ప్రయాణికుల ఇక్కట్లు
- కార్మికుల ఆత్మాహుతి యత్నాలు
- ఉదృతమవుతున్న ఆర్టీసీ సమ్మె
- కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
- సమ్మెపై స్పందించిన సీఎం రేవంత్
- నేడు డిప్యూటీ సీఎంతో కార్మిక నేతల భేటీ
హైదరాబాద్, మహా : ఆర్టీసీ సమ్మెపై రేపు కార్మికులతో మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రుల బృందం కార్మిక సంఘాలతో చర్చలు జరపనుంది. గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సమ్మెపై ప్రధానంగా చర్చించిన మంత్రివర్గం సమ్మెకు ఏదోలా ముగింపు పలకాలని నిర్ణయించింది. నర్సంపేట, నల్గొండ ఘటనలపై కేబినెట్లో ప్రస్తావన రావడంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టిందని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని ఆదేశించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండోరోజు కొనసాగుతోంది. పలుచోట్ల ఉద్యోగులు నిరసన చేపట్టారు. సమ్మెను విఫలం చేసేందుకు యాజమాన్యం, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమ్మె ఉద్రిక్తంగా మారింది. గురువారం రెండు చోట్ల ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కోలా శంకర్ గౌడ్‌ను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 80 % కాలిన గాయాలతో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్‌లు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని కార్మికుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు.
మరోవైపు నల్గొండలో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. మిర్యాలగూడ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకన్న నల్గొండ డిపో వద్ద ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, తోటి ఆర్టీసీ కార్మికులు ఆయన్ను రక్షించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రెండు ఘటనలతో ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం పోరాడటం తప్పుకాదని, ఆత్మత్యాగాలకు ప్రయత్నించడం సరైంది కాదని మంత్రివర్గం అభిప్రాయపడింది. సీఎం కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.








