Mahaa Daily Exclusive

  డబ్బు కోసమే హత్య.

Share

 

*హత్య కేసును ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు*

*నిందితుడి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు*

మహా వరంగల్ బ్యూరో ;

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 18 వ తేదీన శంభునిపేట బుడగ జంగాల కాలనీలో బీహార్ కు చెందిన వ్యక్తి హత్య కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన హత్య వివరాలతో పాటు నిందితుడి వివరాలను విలేకరుల సమావేశంలో మిల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్ వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోనే సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. పోలీసుల చురుకుదనాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్ రాష్ట్రానికి చెందిన తాన్వీర్ అలం (23) ఉపాధి కోసం మూడు నెలల క్రితం వరంగల్‌ కు వచ్చి రామన్నపేట లో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల ఒత్తిడి కారణంగా డబ్బు కోసం తహతహలాడుతున్న నిందితుడు, ఏప్రిల్ 18న అండర్ బ్రిడ్జ్ సమీపంలోని వైన్ షాప్ వద్ద తన స్వరాష్ట్రానికి చెందిన దూరిషా (60) అనే వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్న నిందితుడు, బాధితుడి వద్ద డబ్బు ఉందని గమనించి దోపిడీకి పథకం రచించాడు. అనంతరం ఇద్దరూ రంగశాయిపేటలోని బాధితుడి గదికి వెళ్లి మద్యం సేవించారు. మద్యం మత్తులో బాధితుడు నిద్రలోకి జారుకున్న సమయంలో అతని వద్ద ఉన్న నగదును దొంగిలించడానికి ప్రయత్నించగా, బాధితుడు మేల్కొని ప్రతిఘటించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ సమయంలోనే తన పై కేసు నమోదవుతుందనే భయంతో నిందితుడు అక్కడే ఉన్న కత్తితో దాడి చేసి బాధితుడిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం రూ. 4,500 నగదును దోచుకుని, నేరానికి ఉపయోగించిన కత్తిని సమీపంలోని పొదల్లో పడేసి అక్కడి నుండి పరారయ్యాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ సమాచారదారుల సహకారంతో నిందితుడిని శంబునిపేట జంక్షన్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నేర సమయంలో ధరించిన దుస్తుల తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. రమేష్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఈ కేసును వేగంగా ఛేదించారు.

ఈ కేసును ఎంతో చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బంది ని ఉన్నతాధికారులు అభినందించారు.