Mahaa Daily Exclusive

  ఆప్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: బీజేపీలో విలీనమైన రాఘవ్ చద్దా బృందం!

Share

  • ఆప్ కు బిగ్ షాక్
  • బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీలు
  • విలీన మంత్రాన్ని ఉపయోగించిన ఎంపీలు
  • పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్ కు కోలుకోలేని దెబ్బ
  • ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్ కు ఆశనిపాతం

న్యూఢిల్లీ, మహా : దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, ఆ పార్టీ గళంగా ముద్రపడిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా చివరకు కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు. తనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులను కలుపుకుని కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో విలీనమయ్యారు. ఈ పరిణామం ఆప్ ఉనికిని రాజ్యసభలో ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, పంజాబ్ రాజకీయాల్లో కూడా పెను మార్పులకు నాంది పలికేలా కనిపిస్తోంది.

‘విలీనం’ వెనుక మాస్టర్ ప్లాన్

రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ‘విలీనం’ అనే పదాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. దీని వెనుక బలమైన రాజ్యాంగ కారణం ఉంది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం, ఏ పార్టీకి చెందిన సభ్యులైనా వ్యక్తిగతంగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే వారి పదవి పోతుంది. అయితే, పార్టీలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల (2/3) మంది ఏకమై మరో పార్టీలో విలీనం అయితే వారికి అనర్హత వేటు పడదు. రాజ్యసభలో ఆప్‌కు మొత్తం 10 మంది సభ్యులుండగా, అందులో ఏడుగురు (70 శాతం) ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లారు. దీంతో వీరంతా తమ ఎంపీ పదవులను కాపాడుకుంటూనే బీజేపీలో కొనసాగే అవకాశం లభించింది. “మేము ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండొంతుల మందిమి.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతున్నాం” అని చద్దా స్పష్టం చేశారు.

పంజాబ్‌లో ఆప్‌కు కోలుకోలేని దెబ్బ

ఈ తిరుగుబాటు ప్రభావం పంజాబ్ రాష్ట్రంపై తీవ్రంగా ఉండనుంది. పార్టీని వీడిన ఏడుగురిలో ఆరుగురు పంజాబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన తర్వాత వీరంతా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆప్ వద్ద పంజాబ్ నుండి కేవలం ఒకే ఒక్క ఎంపీ (బల్బీర్ సింగ్ సీచేవాల్) మిగిలారు. మరో 10 నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వానికి ఇది పెద్ద రాజకీయ సవాలుగా మారింది. క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సందీప్ పాఠక్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్ వంటి ప్రముఖులు కూడా చద్దా వెంటే నడవటం ఆప్ కేడర్‌ను విస్మయానికి గురిచేసింది.

స్వాతి మలివాల్ ఎపిసోడ్

గత కొంతకాలంగా ఆప్ నాయకత్వంతో విభేదిస్తున్న ఢిల్లీ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఒంటరిగా బయటకు వస్తే పదవి పోతుందన్న ఉద్దేశంతో ఆమె ఇన్నాళ్లూ వేచి చూశారు. ఇప్పుడు రాఘవ్ చద్దా బృందంతో కలిసి ఆమె తన దారిని సుగమం చేసుకున్నారు. ఆమె రాజ్యసభ పదవీకాలం 2030 వరకు ఉంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో కేవలం ముగ్గురు సభ్యులు (సంజయ్ సింగ్, బల్బీర్ సింగ్ సీచేవాల్, ఎన్డీ గుప్తా) మాత్రమే మిగిలారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్‌కు, సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.