హైదరాబాద్, మహా.
న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించిన వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరిచారా లేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఇప్పటికే ఫుటేజీని భద్రపరిచినట్లు ప్రభుత్వ ప్లీడర్ (జీపీ) కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో తనపై మంగ్లీ నుంచి ప్రాణహాని ఉందని, ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసినా పోలీసులు కనీసం స్పందించలేదని సుబ్బారావు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. బాధితుడు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా జీపీని ధర్మాసనం నిలదీసింది.
కాగా, బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ ప్లీడర్ కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం.. వివరణ సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.








