Mahaa Daily Exclusive

  మిలియన్‌ మార్చ్‌ కేసుల నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు విముక్తి…

Share

హైదరాబాద్‌ , మహా.
తెలంగాణ ఉద్యమ కాలం నాటి మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా నమోదైన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దశాబ్ద కాలం క్రితం నాటి ఈ కేసులను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2011 మార్చిలో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో పలు మీడియా సంస్థల కెమెరాలు, ఓబీ వ్యాన్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆందోళనకారులతో పాటు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను కూడా నిందితులుగా చేర్చారు.
ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఆస్తి నష్టం లేదా ఘర్షణలతో పిటిషనర్లకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, వారిని రాజకీయ కారణాలతోనే కేసులో చేర్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ తుది నిర్ణయం వెలువరించింది. సుమారు 15 ఏళ్ల తర్వాత ఈ కేసుల నుంచి విముక్తి లభించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.