Mahaa Daily Exclusive

  శంకర్‌గౌడ్‌ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.:ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి.

Share

హుజూరాబాద్‌ , మహా.
ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌ ఆత్మహత్య ఘటనపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన అభివర్ణించారు. శనివారం హుజూరాబాద్‌లోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లే ఇటువంటి బలిదానాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన చారిత్రాత్మక జీఓను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వ ఉదాసీనత వల్ల కార్మికుల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొందని, దీనికి పాలకులే సమాధానం చెప్పాలని కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో ఏటా రూ. 1500 కోట్లు కేటాయించి ఆర్టీసీని అన్ని విధాలా బలోపేతం చేశామని, అయితే నేడు నిధుల కొరతతో సంస్థ కునారిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పెండింగ్‌ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, వారికి పూర్తిస్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవడానికి తగినన్ని నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
కార్మికులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలపై కలిసికట్టుగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, కార్మికులకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని ఆయన హెచ్చరించారు.