- శంకర్‌గౌడ్ కుటుంబానికి ‘సర్కారు’ భరోసా.
- రూ. 10 లక్షల సాయం, ఒకరికి ఉద్యోగం
హైదరాబాద్ మహా.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిగిన మంత్రుల బృందం భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతకుముందు శంకర్‌గౌడ్ మృతి పట్ల మంత్రులు, జేఏసీ నేతలు సంతాపం ప్రకటించి నివాళులర్పించారు.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ఈ ఆపత్కాలంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శంకర్‌గౌడ్ అంత్యక్రియలు సజావుగా సాగేలా జేఏసీ నేతలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని, నేతలు సంయమనం పాటించాలని ఆయన హితవు పలికారు. కార్మికులు ఎవరూ ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుకోవాలని కోరారు.
కాగా, మంత్రుల భేటీకి ముందు జేఏసీ నేతలు సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కార్మికుల 32 డిమాండ్లలో ఇప్పటికే 27 అంశాలపై సానుకూలత వ్యక్తమైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కమిటీపై నమ్మకంతోనే చర్చలకు వచ్చామని, కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చాలని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. శంకర్‌గౌడ్ మృతి వంటి ఘటనలు మళ్లీ జరగవద్దని, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, జేఏసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నెరవేర్చే డిమాండ్లపై రాతపూర్వక అగ్రిమెంట్ తీసుకోవాలని జేఏసీ నిర్ణయించింది.








