హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించే చలానాలపై భవిష్యత్తులో ఎటువంటి రాయితీలు కానీ, రద్దు కానీ ఉండబోవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. చాలామంది వాహనదారులు ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు డిస్కౌంట్లు ఇస్తుందనే ధీమాతో నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని, అటువంటి ధోరణికి చరమగీతం పాడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా వేల సంఖ్యలో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ఆ గుండెకోతను నివారించాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన రహదారి భద్రతపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం వాహనచోదకుల స్వీయ తప్పిదాల వల్లనే సంభవిస్తున్నాయని డీజీపీ విశ్లేషించారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనం నడపటం, తప్పుడు మార్గంలో ప్రయాణించడం వంటి కారణాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని, కానీ సామాజిక స్పృహ లోపించడం వల్ల రాష్ట్రంలో సగటున రోజుకు 20 కుటుంబాలు తమ ఆధారాన్ని కోల్పోతున్నాయని వివరించారు. ఈ మరణాల రేటును తగ్గించేందుకు పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఎరైవ్-ఎలైవ్’ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, 2025 మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య 16 శాతం మేర తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.
రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా ఫీడర్ రోడ్లు ప్రధాన రహదారుల్లో కలిసే చోట సరైన సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అటువంటి ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపడుతున్నామని వివరించారు. కేవలం జరిమానాలు వేయడం పోలీసుల లక్ష్యం కాదని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇకపై నిబంధనల విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు.








