దిల్లీ,మహా.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం ఇకపై మరింత వేగంగా, సాఫీగా సాగనుంది. డిసెంబర్ నాటికి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేని, నిరంతరాయ టోలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. శుక్రవారం దిల్లీలో నిర్వహించిన ‘లాజిస్టిక్స్ శక్తి సమిట్-2026’ రెండో ఎడిషన్‌లో ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పన కీలకమని, ముఖ్యంగా లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడం ద్వారానే భారత్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఏఐ అనలిటిక్స్‌తో కూడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), ఫాస్టాగ్ సాంకేతికతలను అనుసంధానించి సరికొత్త వ్యవస్థను తీసుకువస్తున్నట్లు వివరించారు. ఈ విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద హై-పెర్ఫార్మెన్స్ కెమెరాలు వాహనాలను గుర్తించి ఆటోమేటిక్‌గా ఛార్జీలను వసూలు చేస్తాయని, నిబంధనలు ఉల్లంఘించే వారికి ఈ-నోటీసులు పంపడంతో పాటు ఫాస్టాగ్ సస్పెన్షన్ వంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే లాజిస్టిక్స్ వ్యయాన్ని సింగిల్ డిజిట్‌కు తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. ఐఐటీలు మరియు ఐఐఎంల నివేదికల ప్రకారం, దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం వల్ల లాజిస్టిక్స్ వ్యయం గతంలోని 16 శాతం నుంచి ఇప్పటికే 10 శాతానికి తగ్గిందని గుర్తు చేశారు. అమెరికా, ఐరోపా దేశాల్లో ఇది 12 శాతంగా ఉండగా, చైనాలో 8-10 శాతంగా ఉందని, మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభం వంటి పరిణామాల వల్ల ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం మన చమురు అవసరాల కోసం 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్థిక భారంతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని, దీనికి ప్రత్యామ్నాయంగా హరిత హైడ్రోజన్, జీవ ఇంధనాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు.
భవిష్యత్తులో 100 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఆటోమొబైల్ సంస్థలకు గడ్కరీ హితవు పలికారు. కేవలం ఇథనాల్‌తోనే కాకుండా చెత్త నుంచి హైడ్రోజన్ తయారు చేసే వినూత్న పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల సాకారమవుతుందని గడ్కరీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు కొనసాగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








