* రోడ్డు ప్రమాదాలపై డీజీపీ శివధర్ రెడ్డి ఆందోళన.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిత్యం సగటున 20 కుటుంబాలు తమ ఇంటి పెద్దనో లేదా ఆధారమైన వ్యక్తినో కోల్పోయి రోడ్డున పడుతుండటంపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాహనచోదకుల్లో సామాజిక స్పృహ లోపించడం, ట్రాఫిక్ నిబంధనల పట్ల కనీస అవగాహన లేకపోవడమే ఈ ఘోరాలకు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. రహదారి భద్రత అన్నది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి ఉండాల్సిన కనీస బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. కేవలం చిన్నపాటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక శాతం ప్రమాదాలను పరిశీలిస్తే అవి ముమ్మాటికీ వాహనదారుల స్వీయ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని డీజీపీ పేర్కొన్నారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనం నడపటం, రహదారులపై రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలు మృత్యువుకు దారితీస్తున్నాయి. హెల్మెట్ ధరించడం లేదా సీట్‌బెల్ట్ పెట్టుకోవడం వంటి ప్రాథమిక సూత్రాలను విస్మరించడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం కోల్పోతున్నారని వివరించారు. రహదారుల అభివృద్ధి ఎంతగా జరిగినప్పటికీ, మానవీయ తప్పిదాలు తగ్గనంత కాలం ఈ మరణాల రేటును అదుపు చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఫీడర్ రోడ్లు ప్రధాన రహదారిలో కలిసే చోట వాహనదారులు వేగం తగ్గించకపోవడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని, అటువంటి ప్రాంతాల్లో సైన్ బోర్డులు మరియు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ చలానాల విషయంలో వాహనదారుల్లో ఉన్న అశ్రద్ధను తొలగించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని డీజీపీ వెల్లడించారు. భవిష్యత్తులో చలానాలపై ఎటువంటి రాయితీలు కానీ, రద్దు కానీ ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ఖచ్చితంగా చెప్పారని, జరిమానాల నుంచి మినహాయింపు లభిస్తుందనే ధీమాతోనే చాలామంది నిబంధనలను అతిక్రమిస్తున్నారని గుర్తించినట్లు పేర్కొన్నారు. వేల కుటుంబాల గుండెకోతను నివారించాలంటే ఇటువంటి కఠిన చర్యలు తప్పవని ఆయన వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం మేర తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశమని, ‘ఎరైవ్-ఎలైవ్’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి పునరుద్ఘాటించారు.








