Mahaa Daily Exclusive

  మే 4 తర్వాత ప్రతి అన్యాయంపై ఫైళ్లు తెరుస్తాం…బెంగాల్‌ గడ్డపై ప్రధాని మోదీ హెచ్చరిక.

Share

హౌరా,మహా
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు రికార్డు స్థాయిలో తరలిరావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సర్కారుకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతున్నారని ఆయన కొనియాడారు. శనివారం రాష్ట్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని, ఆ వెంటనే గత ఐదేళ్లలో జరిగిన ప్రతి అన్యాయం, ప్రతి అకృత్యం మరియు ప్రతి అవినీతికి సంబంధించిన ఫైళ్లను బయటకు తీస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. టీఎంసీ గూండాలకు, అవినీతిపరులకు మే 4 తర్వాత బెంగాల్‌లో దాక్కోవడానికి చోటు కూడా దొరకదని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని నిప్పులు చెరిగారు. ఒక పేద తల్లి ఎంతో కష్టపడి తన కూతురిని డాక్టరును చేస్తే, టీఎంసీ ప్రభుత్వం ఆ తల్లికి తన బిడ్డను దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి సాక్ష్యాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూనే సదరు బాధిత తల్లిని తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపామని వెల్లడించారు. మహిళా వ్యతిరేక పార్టీగా మారిన టీఎంసీని సాగనంపేందుకు బెంగాల్‌ నారీ శక్తి సిద్ధంగా ఉందని, 21వ శతాబ్దపు నవ బెంగాల్‌ చరిత్రను ఈ సోదరీమణులే రాస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న సిండికేట్‌ రాజ్, అవినీతి మరియు చొరబాటుదారుల సమస్యలకు చరమగీతం పాడుతామని ప్రధాని వాగ్దానం చేశారు. నిరుద్యోగం వల్ల రాష్ట్ర యువత వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, బీజేపీ అధికారంలోకి రాగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. “ఇది మోదీ గ్యారెంటీ.. పేదలకు ఉచిత రేషన్, మహిళలకు భద్రత మరియు యువతకు ఉద్యోగాలు అందించే బాధ్యత మాది” అని స్పష్టం చేశారు. బెంగాల్‌ ప్రజలు భయం నుంచి విముక్తి పొందే రోజు దగ్గరలోనే ఉందని, మే 4 తర్వాత అరాచక శక్తులకు చట్టపరంగా శిక్ష తప్పదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

Latest