Mahaa Daily Exclusive

  దుశ్చర్ల సత్యనారాయణకు సర్కారు అండ…

Share

* నిమ్స్‌లో ఉచిత వైద్యానికి సీఎం రేవంత్‌ ఆదేశం.
హైదరాబాద్, మహా.
ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి, చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి వేముల శ్రీనివాసులు శుక్రవారం దుశ్చర్ల సత్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని ఆయనకు వివరిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తక్షణమే ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించి, అత్యున్నత స్థాయి వైద్యం అందించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ ప్రాంతంలో ఫ్లోరోసిస్‌ బాధితుల కోసం, కృష్ణా జలాల సాధన కోసం దశాబ్దాల పాటు ఉద్యమించిన సత్యనారాయణ, పర్యావరణ పరిరక్షణలోనూ అద్భుతమైన కృషి చేశారు. తన సొంత భూమిలో ఒక అడవిని సృష్టించి పర్యావరణ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచారు. అటువంటి నిస్వార్థ ప్రజా సేవకుడి ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపడం గమనార్హం. నిమ్స్‌లోని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స అందించాలని రేవంత్‌ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ నిర్ణయం పట్ల పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల ఉద్యమాలకు ప్రాణం పోసిన వ్యక్తికి ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా నిలవడం హర్షణీయమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రం కోసం శ్రమించిన వ్యక్తులను గౌరవించుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని ఈ చర్య ద్వారా రేవంత్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Latest