* పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధి మార్గంలో గ్రామ పంచాయతీలే అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు. గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలనే మహాత్మా గాంధీ సత్యాన్ని ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని, తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి పూర్తిస్థాయిలో కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో స్పష్టం చేశారు.
స్థానిక స్వపరిపాలనకు అసలైన ప్రతీకలైన పంచాయతీలు బలంగా, సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయిలో వేళ్లూనుకుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు లభించిన స్వయం పరిపాలన హక్కులు దేశంలో ప్రజాస్వామిక వికేంద్రీకరణకు పటిష్టమైన దిశానిర్దేశం చేశాయని ఆయన గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పంచాయతీరాజ్ సంస్థలు తమ సాధికారతను, సామర్థ్యాన్ని మరియు జవాబుదారీతనాన్ని నిరంతరం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
స్థానిక స్వయం పరిపాలన అనేది కేవలం అధికార వికేంద్రీకరణ మాత్రమే కాదని, అది గ్రామీణ ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక మార్పులకు నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో స్వయం సమృద్ధి సాధించినప్పుడే నవ భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని, ఈ దిశగా ప్రతి పంచాయతీ ఒక ఆదర్శవంతమైన యూనిట్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రజల అవసరాలను తీరుస్తూ, పారదర్శకమైన పాలనను అందించడంలో పంచాయతీరాజ్ సంస్థలు తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.








