Mahaa Daily Exclusive

  హిల్ట్‌’తో పారిశ్రామిక విప్లవం…

Share

* మే నుంచి కొత్త భూమి విలువలు.
* కాలుష్య రహిత నగరం దిశగా అడుగులు.
* నగరాభివృద్ధికి పారిశ్రామికవేత్తల చేయూత.
* సచివాలయంలో సబ్ కమిటీ కీలక నిర్ణయాలు.
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

హైదరాబాద్‌, మహా.
హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘హిల్ట్’ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీని పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులతో కలిసి ఆయన పారిశ్రామిక రంగ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. నగరం తో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించిందని, ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ క్యాబినెట్ లక్ష్యం కేవలం నగరాన్ని, రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసుకోవడమేనని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వివరించారు.
నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవతలికి తరలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు పారిశ్రామిక ఎస్టేట్ల ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో ఈ తరలింపును తప్పనిసరి చేస్తే అందరూ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని పారిశ్రామికవేత్తలే స్వయంగా సబ్ కమిటీకి వివరించారు. అయితే, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్లతో కూర్చుని చర్చించి, హిల్ట్ పాలసీ అమలును వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ మార్గదర్శకాలను ఖరారు చేసే ముందు పారిశ్రామికవేత్తల ఆలోచనలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పారిశ్రామిక అభివృద్ధిలో చైనా తరహా నమూనాను అనుసరించాలని, ఓఆర్ఆర్ మరియు రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు చేసిన సూచనలను ప్రభుత్వం స్వాగతించింది. అన్ డెవలప్డ్ ల్యాండ్ (యుడిఎల్) పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పారిశ్రామిక పార్కుల ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని భట్టి సూచించారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ డార్మెటరీల నిర్మాణం తప్పనిసరి చేశామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పరిశ్రమలు పటిష్టంగా నడవాలని, అదే సమయంలో కాలుష్యం లేని పర్యావరణాన్ని కాపాడుకోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకమైన దృక్పథంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రెడ్డి మరియు ఉప్పల్, జీడిమెట్ల అసోసియేషన్ల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలపై రాజకీయంగా వస్తున్న విమర్శలను వారు తోసిపుచ్చారు. గత 30 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసిన భూములకు తమ వద్ద సేల్ డీడ్లు ఉన్నాయని, కన్వర్షన్ చార్జీల విషయంలో పారదర్శకత ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కన్వర్షన్ చార్జీలను స్వల్పంగా తగ్గించాలని, తరలింపునకు ఆరు నెలల సమయం ఇవ్వాలని వారు కోరారు. పాత చోట ఉన్న విద్యుత్, నీరు వంటి వసతులను కొత్త ప్రాంతాలకు తరలించే సమయంలో అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ, పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది.
మరోవైపు, రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించిన సబ్ కమిటీ, మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలులోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో ఉన్న భూముల వివరాలను, వాటిలో ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైన వాటిపై జిల్లా కేంద్రాల వారీగా నివేదికలు సేకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విషయంలో అశ్రద్ధ వహించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest