Mahaa Daily Exclusive

  ఎస్.ఎల్.బి.సి సొరంగ భద్రతపై ఎన్‌జీఆర్‌ఐ నివేదిక..

Share

*ప్రమాదాలకు తావులేకుండా తవ్వకాలు.. నెలకు 200 మీటర్ల లక్ష్యం.
*మెడిగడ్డ, అన్నారం బ్యారేజీల భూపరిశోధనల్లోనూ ఎన్‌జీఆర్‌ఐ భాగస్వామ్యం.
• సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష.

హైదరాబాద్‌, మహా.
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్.ఎల్.బి.సి) సొరంగ మార్గ పనుల్లో భద్రతా ప్రమాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సొరంగ మార్గం తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) రూపొందించిన సమగ్ర సర్వే నివేదికను శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఆయన స్వీకరించారు. ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ ఈ నివేదికను మంత్రికి అందజేశారు. గతంలో సొరంగ మార్గ తవ్వకాల సమయంలో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉందని, అందుకే శాస్త్రీయ మార్గదర్శకత్వంలో పనులను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తవ్వకాల ప్రక్రియలో ఎదురయ్యే ముందస్తు ప్రమాదాలను గుర్తించేందుకు ఎన్‌జీఆర్‌ఐ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం విశేషం. ముఖ్యంగా సీస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టొమోగ్రఫీ, వంటి పద్ధతుల ద్వారా భూగర్భంలోని పరిస్థితులను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నివేదికలో సొరంగ మార్గంలోని స్ట్రెస్ జోన్ లు, నీటి ఊటలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు, సొరంగం పైభాగంలోని భూమి పటుత్వం వంటి కీలక అంశాలపై స్పష్టమైన విశ్లేషణను అందించారు. కార్మికుల ప్రాణరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపిన మంత్రి, ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రతి అంగుళం తవ్వకం సాగుతుందని భరోసా ఇచ్చారు. పనుల పునరుద్ధరణ ప్రక్రియ ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతోందని, ఎలక్ట్రిక్ లోడర్లు మరియు భారీ డంపర్ల సాయంతో ఇప్పటివరకు 151.50 మీటర్ల తవ్వకం పూర్తయిందని వెల్లడించారు.
సొరంగ మార్గ పనుల్లో వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంత్రాంగాన్ని సమీకరిస్తోంది. దేశీయ మరియు విదేశీ సంస్థల నుంచి ఆధునిక సాంకేతికతను జోడించి, రెండు వైపుల నుంచి నెలకు సగటున 200 మీటర్ల చొప్పున తవ్వకాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఎస్.ఎల్.బి.సి పనులకే పరిమితం కాకుండా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కూడా ఎన్‌జీఆర్‌ఐ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం చేపట్టే భూపరిశోధన (సాయిల్ టెస్ట్) ప్రక్రియలో ఎన్‌జీఆర్‌ఐ భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇ.ఎన్.సి రమేష్ బాబు, సొరంగ మార్గ నిపుణుడు పరిక్షిత్ మెహ్రా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పనుల పురోగతిని వివరించారు.

Latest