*మైనారిటీ గురుకులంలో సమ్మర్ క్యాంప్*
*విద్యార్థుల నైపుణ్యాలు పరిశీలన*
*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*
మహా వరంగల్ బ్యూరో ;
రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ జిల్లా శంభునిపేట లోని తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హైస్కూల్లో శనివారం నిర్వహించిన సమ్మర్ క్యాంప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థులు కేవలం ఆటలకే పరిమితం కాకుండా, వారిలోని సృజనాత్మకత తో పాటు వివిధ నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ సమ్మర్ క్యాంపులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, కళలు, సాంకేతిక నైపుణ్యాల్లో విద్యార్థులు రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థుల సౌకర్యాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. క్యాంప్ లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళాకృతులను, ప్రాజెక్టులను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుతున్న వసతులు, భోజన నాణ్యతపై ఆరా తీశారు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.








