Mahaa Daily Exclusive

  డిజిటల్ జనగణనకు ఖమ్మం జిల్లా సర్వసిద్ధం…..

Share

  • డిజిటల్ జనగణనకు ఖమ్మం జిల్లా సర్వసిద్ధం.
  • మే 10 వరకు స్వీయ నమోదుకు అవకాశం.
  • డేటా గోప్యతకు పూర్తి భద్రత
  • పెట్రోల్ ఇబ్బందులు లేవు.. జిల్లాకు చేరుకున్న 110 లోడ్ల ఇంధనం
  • కలెక్టర్ దివాకర టి.ఎస్

హైదరాబాద్, మహా.

జిల్లాలో జనగణన ప్రక్రియను డిజిటల్ విధానంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ వెల్లడించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనగణన-2027లో భాగంగా మొదటి దశ ‘హౌస్ లిస్టింగ్’ ప్రక్రియ కోసం ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఈ స్వీయ నమోదు ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ప్రజలందరూ ఇందులో చురుకుగా పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు.
జిల్లాలో మొత్తం 2651 హౌస్ లిస్టింగ్ బ్లాకులను గుర్తించామని, ప్రతి బ్లాక్‌లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటారని కలెక్టర్ వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం 2669 మంది ఎన్యుమరేటర్లు, 485 మంది సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. స్వీయ నమోదు కోసం se.census.gov.in పోర్టల్‌ను సందర్శించి, కుటుంబంలో ఒకరు లాగిన్ అయి వివరాలు నమోదు చేయవచ్చని.. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే 11 అంకెల సంఖ్యను ఎన్యుమరేటర్‌కు అందజేయాలని సూచించారు. డిజిటల్ విధానంలో సేకరించే ఈ డేటా గోప్యత విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తి భద్రత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన స్వీయ నమోదును పూర్తి చేసుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
జిల్లా పరిపాలనపై తనదైన ముద్ర వేస్తానని చెబుతూ.. గతంలో భూపాలపల్లి, జగిత్యాల, ములుగు జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లావ్యాప్తంగా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ అమలు చేస్తున్నామని, ప్రధాన కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే ఏ చిన్న సమస్యనైనా త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్యపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఇంధన కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం ఒక్కరోజే జిల్లాకు 110 లోడ్ల ఇంధనం చేరుకుందని, సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. లాజిస్టిక్ పరమైన ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా వారధిగా కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Latest