- సాదా సీదాగా …..
- ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం
- హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
హైదరాబాద్, మహా : రాష్ట్ర రాజకీయాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్లు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారిద్దరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు. అంతకుముందు, ఆదివారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు వీరి నియామకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
మైనార్టీల సంక్షేమమే నా లక్ష్యం: ఎమ్మెల్సీ అజారుద్దీన్
ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రిమండలికి, టీపీసీసీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారి అభివృద్ధి కోసం తాను మరింత నిబద్ధతతో కృషి చేస్తానన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, మైనార్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి వల్లే తనకు ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను అధిగమిస్తూ ప్రజాసేవలో ముందుంటానని ఈ సందర్భంగా అజారుద్దీన్ స్పష్టం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కోదండరాం మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో తాను భాగమై, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీకి ధన్యవాదాలు తెలిపారు.
అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్..
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. గవర్నర్ కోటా కింద పెండింగ్‌లో ఉన్న 2 ఎమ్మెల్సీ పదవుల నియామక ఫైల్‌పై గవర్నర్ శివ్‌ప్రతాప్ సంతకం చేయడంతో మంత్రి అజారుద్దీన్ పదవీ గండం నుంచి గట్టెక్కారు. గత ఏడాది ఆగస్టు 30న ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్లను ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అప్పటి నుండి రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం మంత్రి అజారుద్దీన్‌కు అత్యంత కీలకంగా మారింది. శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం లేకుండానే ఆయనను రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ప్రమాణం చేయించింది. నిబంధనల ప్రకారం 6 నెలల గడువులోగా ఏదైనా సభలో సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉండగా, ఆ గడువు ముగిసే సరిగ్గా కొన్ని రోజుల ముందు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ నిర్ణయంతో అటు ప్రభుత్వం, ఇటు అజారుద్దీన్ కు ఊరట లభించింది. దీంతో ఆయన మంత్రి పదవికి ఎదురైన సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి.








