*మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల బంద్
*సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల సంచలన నిరసన నిర్ణయం
*అద్దె భారం భరించలేక మూతపడనున్న సినిమా థియేటర్లు
హైదరాబాద్, మహా.
తెలంగాణ చిత్ర పరిశ్రమలో మరో పెను సంక్షోభం తలెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను మే 1వ తేదీ నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రెంటల్ సిస్టమ్’ (స్థిర అద్దె విధానం) వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, సినిమా ఆడినా ఆడకపోయినా పంపిణీదారులకు భారీగా అద్దెలు చెల్లించాల్సి రావడం భారంగా మారిందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీల ప్రభావం, భారీ బడ్జెట్ సినిమాల కొరతతో ఇప్పటికే థియేటర్లకు ప్రేక్షకుల రాక గణనీయంగా తగ్గగా, నిర్వహణ ఖర్చులు పెరగడం వారిని ఈ కఠిన నిర్ణయం వైపు నెట్టింది.
ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, సిబ్బంది జీతాలు చెల్లించలేక రాష్ట్రంలోని వందలాది థియేటర్లు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గతంలో కలెక్షన్లలో వాటా పద్ధతి (పర్సంటేజ్ సిస్టమ్) అమల్లో ఉండేదని, కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు విధిస్తున్న భారీ రెంటల్స్ వల్ల షోలు నడిపించడం కంటే థియేటర్లు మూసివేయడమే మేలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. హైదరాబాద్ సహా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లోని పట్టణాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడం ఒక ఎత్తైతే, పెద్ద సినిమాల కోసం భారీగా చెల్లిస్తున్న అద్దెలు గిట్టుబాటు కాకపోవడం ఎగ్జిబిటర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ బంద్ ప్రభావం వేసవి సెలవుల్లో విడుదల కావాల్సిన పలు చిత్రాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ప్రభుత్వం మరియు పంపిణీదారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని, పాత పద్ధతిలోనే కలెక్షన్ల షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సింగిల్ స్క్రీన్ వ్యవస్థ మనుగడ సాగించడం అసాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. పంపిణీదారుల మొండివైఖరి నశించాలని, ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చలు జరపాలని రాష్ట్ర సినిమా ఎగ్జిబిటర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.








