- అనంతపురం హనీట్రాప్ కేసు
- నలుగురు పోలీసులు డిస్మిస్
- మరికొందరిపై సస్పెన్షన్ వేటు
- రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వైనం
అనంతపురం, మహా : అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో వెలుగు చూసిన హనీట్రాప్ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. హనీట్రాప్ ముఠాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులను ఏకంగా సర్వీసు నుండి తొలగిస్తూ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల నుండి తొలగించిన వారిలో రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్స్ దుర్గాప్రసాద్, దేవ్లానాయక్ ఉన్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన మరి కొంతమంది పోలీసు అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అనంతపురం రూరల్ సీఐ శేఖర్‌ను వీఆర్ కు పంపడమే కాకుండా, ఆయనను కర్నూలు రేంజ్ డీఐజీకి సరెండర్ చేశారు. అలాగే, ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఎస్ఐ రాంబాబుతో పాటు కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాంలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి హనీట్రాప్ ముఠాకు సహకరించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దాంతో పోలీస్ శాఖ వీరిపై కఠిన చర్యలు తీసుకుంది.
నిందితులకు 14 రోజుల రిమాండ్
హనీ ట్రాప్ కేసులో నిందితులను మూడు రోజుల కిందట అనంతపురం నగర పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరిచారు. హనీ ట్రాప్ ముఠా సభ్యులైన చంద్రకళ, జయమ్మ, దబ్బర రాజేష్ నాయుడు, అనంత కుమారిలకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం పోలీసులు నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచారు. వివరాలు పరిశీలించిన కోర్టు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది. ముఠా సభ్యుల నుంచి రూ. 13 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాదాపు కోటి రూపాయలకు పైగా ఈ ముఠా సభ్యులు వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవన్న ఉన్నతాధికారులు
ఈ హనీట్రాప్ కేసులో ముఠా సభ్యులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మొత్తం 9 మంది సభ్యులున్న ఈ ముఠాలో ఇప్పటికే ఐదుగురిపై చర్యలు తీసుకోగా, తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అమాయక ప్రజలను మోసం చేస్తూ పరువు పేరుతో బెదిరింపులకు పాల్పడే ఇలాంటి ముఠాలకు సహకరించే వారు ఎంతటి వారైనా, చివరికి వారు పోలీసులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, ఎస్పీ జగదీశ్ హెచ్చరిస్తున్నారు.
ఈ ముఠా ఆగడాలు ఏడాది కిందటే మొదలయ్యాయి. అనంతపురం పట్టణానికి చెందిన ఒక 62 ఏళ్ల వృద్ధుడిని గతేడాది నవంబరు 2న ఈ ముఠా పక్కా ప్లాన్‌తో వలపు వలలో పడేసింది. బాధితుడిని ట్రాప్ చేసిన తర్వాత నిందితులు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. జరిగిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, తీవ్రమైన కేసుల్లో ఇరికిస్తామని ఆ వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వ్యవహారం ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు తన పరువు కాపాడుకోవాలనే ఆవేదనతో ఆ వ్యక్తి వారితో బేరసారాలు ఆడి, రూ. 2 లక్షలు చెల్లించి ఆ గండం నుంచి బయటపడ్డాడు. తాజాగా ఈ అక్రమాలన్నీ వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.








