*విదేశీ బాబుల వేషంలో సైబర్ కేటుగాళ్ల మోసాలు
*పర్యాటక ప్రాంతాల పేరుతో ఆన్లైన్ మాయగాళ్ల వేట
*సైబర్ నేరగాళ్ల మాయలో పడవద్దు అప్రమత్తంగా ఉండండి
హైదరాబాద్, మహా.
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులమని పరిచయం చేసుకుంటూ, తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే నెపంతో లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పర్యాటకులు, ఫుడ్ వ్లాగర్లను లక్ష్యంగా చేసుకుని ఈ కేటుగాళ్లు తమ వల విసురుతున్నారు. ముందుగా ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి వేదికల ద్వారా స్నేహం చేసి, ఆపై భారీ కమీషన్ల ఆశ చూపి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ ఉద్యోగికి అమెరికా నుంచి వస్తున్నానంటూ పరిచయమైన వ్యక్తి, విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆపేశారని నమ్మించి ఏకంగా రూ.2 లక్షలు వసూలు చేశాడు. మరో ఘటనలో నారాయణగూడకు చెందిన వ్యాపారికి యూకే మహిళగా పరిచయమైన కేటుగాడు, కారు ఏర్పాటు కోసం అడ్వాన్స్ పంపిస్తానని నమ్మించి ఒక ఏపీకే ఫైల్‌ను పంపాడు. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయగానే వ్యాపారి ఫోన్ హ్యాక్‌కు గురై ఖాతాలోని రూ.12 లక్షలు మాయమయ్యాయి. ఇలాంటి మోసగాళ్లు తాము త్వరలోనే ఇండియాకు వస్తున్నామని, హోటల్ బుకింగ్స్ , ట్రావెల్ ఖర్చుల కోసం సహాయం చేస్తే కోటి రూపాయల వరకు ఇస్తామని ఆశ చూపుతున్నారు.
ముంబయి లేదా దిల్లీ విమానాశ్రయాల్లో తమను అధికారులు ఆపారని, ప్రస్తుతం భారతీయ కరెన్సీ అత్యవసరమని కోరడం వీరి ప్రధాన వ్యూహం. ఒకసారి డబ్బు పంపిన తర్వాత లేదా వారు పంపిన అనుమానాస్పద లింకులను క్లిక్ చేసిన తర్వాత బాధితులకు మోసపోయామని తెలిసేలోపే నేరగాళ్లు కనుమరుగవుతున్నారు. ఆన్లైన్ పరిచయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లను అస్సలు డౌన్లోడ్ చేయవద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.








