Mahaa Daily Exclusive

  హైదరాబాద్ మెట్రో రైలు ఇక ప్రభుత్వ పరం….

Share

*హైదరాబాద్ మెట్రో రైలు ఇక ప్రభుత్వ పరం
*ఎల్‌అండ్‌టీ మెట్రో వాటా కొనుగోలుకు రంగం సిద్ధం
*ప్రైవేట్ నుంచి సర్కారు చేతికి భాగ్యనగర మెట్రో
హైదరాబాద్, మహా.
భాగ్యనగర రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ప్రైవేట్ నిర్వహణలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైలు లిమిటెడ్ లోని వంద శాతం ఈక్విటీని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఎల్ అండ్ టీ , హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రతినిధులు ఒకటి రెండు రోజుల్లో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ) పై సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందం పూర్తయిన వెంటనే మెట్రో అధికారికంగా ప్రభుత్వ పరం కానుంది.
ఈ బదిలీ ప్రక్రియలో ఆర్థిక అంశాలు అత్యంత కీలకంగా మారాయి. ఏప్రిల్ 30 నాటికి ప్రాజెక్ట్ అప్పు సుమారు 13,615 కోట్ల రూపాయలకు చేరుకోగా, మిగిలిన 1,385 కోట్ల రూపాయలను ఈక్విటీ కింద చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, రిజిస్ట్రేషన్, స్టాంపులు, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాలకు మెట్రో సంస్థ చెల్లించాల్సిన 379.19 కోట్ల రూపాయల బకాయిలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ బకాయిల చెల్లింపు మరియు సర్దుబాటుపై ఇరుపక్షాలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన వెంటనే సంతకాల ప్రక్రియ ముగియనుంది. యాజమాన్యం మారినప్పటికీ, సాంకేతిక కారణాల దృష్ట్యా ‘ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్’ పేరు మరో రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.
మెట్రో రైలు నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం కీలక జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం పని చేస్తున్న 115 మంది ఎల్ అండ్ టీ ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. వీరి జీతభత్యాల కోసం సుమారు 24.3 కోట్ల రూపాయలను హెచ్ఎంఆర్ఎల్ భరించనుంది. అలాగే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాల్లో సలహాల కోసం ఎల్ అండ్ టీకి చెందిన ఏడుగురు సీనియర్ అధికారుల సేవలను ఆరు నెలల పాటు పొందనున్నారు. ఈ మార్పుల అనంతరం నగరవాసులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
త్వరలోనే హైదరాబాద్ ప్రయాణికుల కోసం ‘కామన్ మొబిలిటీ యాప్’ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ తో పాటు ఓలా, ఊబర్ వంటి సేవలన్నింటినీ ఒకే యాప్ ద్వారా బుక్ చేసుకునే వీలుంటుంది. ఉమ్టా ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ యాప్ నగర ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ప్రైవేట్ నిర్వహణ నుండి ప్రభుత్వ హస్తగతం కావడం ద్వారా మెట్రో రెండో దశ విస్తరణ పనులు కూడా వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.