Mahaa Daily Exclusive

  పథకాల నిర్వహణకు నిధుల వేట……

Share

*పథకాల నిర్వహణకు నిధుల వేట
*తెలంగాణ సర్కారు భారీ కసరత్తు
*మే, జూన్ నెలల్లో రూ.12 వేల కోట్ల రుణ సేకరణ
*వడ్డీ భారం తగ్గించేలా ఆర్థిక శాఖ వ్యూహాత్మక అడుగులు
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. రాబోయే మే, జూన్ నెలల్లో కొత్తగా రూ.12 వేల కోట్ల నిధులను సేకరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలానికి ఉంచాలని రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. తక్కువ వడ్డీ రేట్లతో అంటే 7 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఈ రుణాలను పొంది, వాటిని 6 నుంచి 25 ఏళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించేలా వ్యూహరచన చేస్తోంది. గతంలో 10 శాతం కంటే ఎక్కువ వడ్డీలకు తీసుకున్న రుణాల వల్ల ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకే ఈ ‘తక్కువ వడ్డీ రుణాల’ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై దృష్టి సారించింది. మొదటి దశ మెట్రోను రూ.15 వేల కోట్ల వ్యయంతో ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం హస్తగతం చేసుకుంటోంది. ఇందులో రూ.13 వేల కోట్ల రుణం, రూ.2 వేల కోట్ల ఈక్విటీ వాటా ఉంది. ఈ నెల 30వ తేదీ లోపు ఈ లావాదేవీల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, ఇందుకు అవసరమైన మొత్తాన్ని హెచ్‌ఎండీఏ ద్వారా సమకూర్చుతోంది. దీనితో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.6,200 కోట్ల బకాయిలు, ఆర్టీసీకి అవసరమైన నిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ బిల్లుల సర్దుబాటు వంటి ఖర్చుల కోసం ఈ కొత్త రుణాలు అత్యంత కీలకంగా మారాయి.
మరోవైపు పాత బకాయిల కిస్తీలను తగ్గించుకునేందుకు ఆర్థిక శాఖ ‘డెట్ రీస్ట్రక్చరింగ్’ విధానాన్ని అనుసరిస్తోంది. గతంలో తీసుకున్న అధిక వడ్డీ రుణాలను తీర్చివేసి, వాటి స్థానంలో తక్కువ వడ్డీకి లభించే రూ.25 వేల కోట్ల రుణాలను పొందాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్ల దాకా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ఖజానాకు ఆదాయాన్ని పెంచేందుకు కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. వచ్చే నెల నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.