Mahaa Daily Exclusive

  పెట్రోల్, డీజిల్ కొరత ేదంటున్న పౌరసరపరాల శాఖ…

Share

  • పెట్రోల్, డీజిల్ కొరత ేదంటున్న పౌరసరపరాల శాఖ
  • బంకుల ముందు క్యూలు కడుతున్న వాహనదారులు
  • కొరతకు ఆయిల్ కంపనీలకు ముందస్తు చెల్లింపులే అసలు కారణం

హైదరాబాద్, మహా : తెలంగాణలో ఇంధన నిల్వలకు సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే వార్తలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ వాస్తవ పరిస్థితిని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా చమురు, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని సరఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేవని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వదంతుల కారణంగా ప్రజలు ఒకేసారి పెట్రోల్ బంకుల వద్దకు రావడంతో అనవసర రద్దీ ఏర్పడుతోందని, ఇది కృత్రిమ కొరతకు దారితీసే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

పౌర సరఫరాల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో ప్రతిరోజూ సగటున 24 వేల కిలోలీటర్ల చమురు వినియోగం జరుగుతోంది. ఇందులో 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలోలీటర్ల డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదని, రోజుకు 2.22 లక్షలకుపైగా సిలిండర్ల పంపిణీ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఆయిల్ రిఫైనరీల నుండి డిపోలకు, అక్కడి నుండి బంకులకు చేరే సరఫరా గొలుసు అత్యంత పటిష్టంగా ఉందని, ఎక్కడా అంతరాయం లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలను నమ్మి ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఎవరైనా కావాలని కృత్రిమ కొరత సృష్టించినా, ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంధన సరఫరాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా అనుమానాలు ఉంటే వినియోగదారులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని అధికారులు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.

కాగా, అధికారుల వాదన ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఖమ్మం, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. ఇక హైదరాబాద్ శివారు పెట్రోల్ బంకుల్లోనూ చాలా చోట్ల సరిపడా స్టాక్ ఉండటం లేదు. కొన్ని బంకుల్లో పెట్రోల్ ఉంటే డిజీల్ లేకపోవటం, డీజిల్ ఉంటే పెట్రోల్ లేకపోవటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. మరికొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టి పూర్తిగా మూసేశాయి. దీనికి కారణం ఆయిల్ కంపెనీలకు ముందస్తు చెల్లింపులేనని బంకుల యజమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా వాహనాల్లో ఇందనం నింపుకునేందుకు వాహనాదారులు బంకుల ముందు బారులు తీరటం మాత్రం వాస్తవం.