Mahaa Daily Exclusive

  వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి కావాలి…

Share

వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి కావాలి.
*దేశంలో 50 శాతం వైద్య సేవలు మన రాష్ట్రం నుంచే అందాలన్నదే లక్ష్యం.
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచే అందించాలన్న గొప్ప లక్ష్యంతో రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని, వైద్య రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో హాస్పిటల్ నిర్మించిన ‘ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్’ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో పాటు యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని తీసుకువచ్చిందని, వైద్య రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మెడికల్ టూరిజం మరింత వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పశ్చిమాసియా దేశాలతో నేరుగా విమాన సర్వీసులు నడపాలని ఇప్పటికే ప్రధానమంత్రిని, పౌర విమానయాన శాఖ మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ వైద్య సౌకర్యాలు తెలంగాణ నుంచి అందాలన్న లక్ష్యంతో ఎక్కడా లోపాలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 1967లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్‌లో ఐడీపీఎల్ (IDPL) ఏర్పాటు చేయడంతోనే నగరం ఫార్మా హబ్‌గా అవతరించిందని, నేడు దేశం నుంచి ఎగుమతి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
అపోలో హాస్పిటల్స్ ప్రస్థానాన్ని కొనియాడుతూ, 46 ఏళ్ల కిందట చెన్నైలో కేవలం 150 పడకలతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు తన 76వ బ్రాంచ్‌ను ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. 2028 డిసెంబర్ లోపు అపోలో తన 100వ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఆ ప్రారంభోత్సవానికి కూడా తనను ఆహ్వానించాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తన అభిలాషను వ్యక్తం చేశారు. అపోలో హాస్పిటల్స్ దేశానికే ఒక రోల్ మాడల్‌గా నిలిచిందని, అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప బ్రాండ్‌గా ఎదిగి సహాయం ఆశిస్తున్న కోట్లాది మంది ప్రజల మనసుల్లో నిలిచిందని ఆయన ప్రశంసించారు.
ముఖ్యంగా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మహిళా సాధికారతను తన చేతల్లో చూపించారని, ఆయన తన నలుగురు కుమార్తెలను అపోలోకు నాలుగు స్తంభాలుగా, విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా మరియు బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అపోలో ప్రతినిధులు డాక్టర్ సంగీతా రెడ్డి, శోభనా కామినేని, ఉపాసన కొణిదెలతో పాటు పలువురు వైద్యులు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.