* హరీశ్ రావు సంచలన ట్వీట్.
*ప్రజల గుండెల్లో మార్మోగుతున్న నినాదం ఇదే.
* అభివృద్ధి మళ్ళీ పరుగులు తీస్తుంది.
హైదరాబాద్, మహా.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదికగా, సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతికగా బీఆర్ఎస్ను ఆయన అభివర్ణించారు. పదేళ్ల పాలనలో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక అని, తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపికగా పార్టీని కొనియాడుతూ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన గులాబీ జెండా మళ్ళీ సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై హరీశ్ రావు తన ప్రసంగంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాపపు పాలన కొనసాగుతోందని, ప్రజల జీవితాలు నలిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం అడుగంటిపోయిందని, అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, అరాచకం తాండవం చేస్తున్న ఈ కాలంలో ప్రజల గుండెల్లో కేవలం ఒకటే నినాదం మార్మోగుతోందని చెప్పారు. అది మరేదో కాదు.. “**రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి**” అన్నదే ప్రజల అసలైన ఆవాజ్ అని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సాధించిన ప్రగతిని గుర్తు చేస్తూ, ప్రజల పక్షాన నిలబడే శక్తి కేవలం తమ పార్టీకే ఉందని ఉద్ఘాటించారు.
ఉద్యమంలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడిందని, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుందని హరీశ్ రావు పేర్కొన్నారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తిని ఎవరూ అణచలేరని చెప్పారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్ళీ పరుగులు తీసే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ తన సందేశాన్ని ముగించారు.








