Mahaa Daily Exclusive

  పోలీస్ శాఖలో భారీగా బదిలీలు….

Share

* డీఎస్పీలు, ఏసీపీలకు స్థానచలనం.
*శాంతిభద్రతల బలోపేతమే లక్ష్యం.
*డీజీపీ కార్యాలయం నుంచి కీలక ఉత్తర్వులు.
* 21 మంది అధికారుల బదిలీ వేటు.

హైదరాబాద్, మహా.

**తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు డీఎస్పీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు మరియు సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం, క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు స్థానచలనం కలిగింది.**
ఈ బదిలీల్లో భాగంగా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారులను క్షేత్రస్థాయి పోస్టింగులకు పంపగా, మరికొందరు అధికారులను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఎస్. మధుసూదన్‌ను కామారెడ్డి ఎస్డీపీఓగా, మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఏసీపీ సి. అంజయ్యను వికారాబాద్ ఎస్డీపీఓగా నియమించారు. అదేవిధంగా సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీ టి. రాజశేఖర్ రెడ్డిని మల్కాజిగిరి-భోంగీర్ ఎస్‌ఓటీ ఏసీపీగా బదిలీ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో విధులు నిర్వహిస్తున్న బి. అశోక్‌ను ఆసిఫాబాద్‌కు, ఇంటెలిజెన్స్ నుంచి ఎం. అరుణ్ కుమార్‌ను భద్రాచలానికి, పి. శ్రీనివాస్‌ను నిర్మల్ ఎస్డీపీఓలుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైదరాబాద్ నగర పరిధిలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా కె. నర్సింగరావు, చిక్కడపల్లి ఏసీపీగా జి. రణవీర్ రెడ్డి, ఉప్పల్ ఏసీపీగా వై. వెంకట్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వై. వెంకటేశ్వరరావును మేడ్చల్-జీడిమెట్ల ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు. కాగా, ఇప్పటివరకు బాధ్యతల్లో ఉన్న ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఎల్. రమేష్ కుమార్, కె. సుబ్బరామి రెడ్డి, ఎస్. సుదర్శన్ వంటి అధికారులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. సిఐడి విభాగం నుంచి కె. శ్రీనివాసును ఆసిఫ్ నగర్ ఏసీపీగా నియమించగా, జగిత్యాల ఎస్డీపీఓగా కె. పురుషోత్తం రెడ్డిని కేటాయించారు.
మరోవైపు మల్టీ జోన్-2 పరిధిలోనూ ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. పరిగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కె. కొండల్ రెడ్డిని, అమ్రాబాద్ సర్కిల్‌కు ఎస్. చంద్రయ్యను, చందూర్ సర్కిల్‌కు టి. రామును నియమించారు. ఎస్ఐల విభాగంలో గుండాల పోలీస్ స్టేషన్ బాధ్యతలను ఎం. శోభన్ బాబుకు అప్పగించారు. ఈ బదిలీలన్నీ తక్షణమే అమలులోకి వస్తాయని, బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలను స్వీకరించి, సంబంధిత నివేదికలను సమర్పించాలని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ కీలక మార్పుల ద్వారా పోలీస్ శాఖలో నూతనోత్సాహం వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.