- రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్లను విస్తరించండి
- ముఖ్యమంత్రి కి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లేఖ
- ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భూసేకరణ, మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మహా .
నగరంలో రైలు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్, పునరాభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు వెళ్లే అప్రోచ్ రోడ్లను వెంటనే విస్తరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల వల్ల కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు సుమారు రూ.430 కోట్లతో చెర్లపల్లిలో అత్యాధునిక టెర్మినల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని, ఈ ఏడాది జనవరి 6న దీనిని ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయని, ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన దృష్ట్యా స్టేషన్ వెలుపల ఇరువైపులా రోడ్ల విస్తరణ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
చెర్లపల్లి స్టేషన్ కు సంబంధించి ఎఫ్‌సీఐ గోడౌన్ రోడ్డు నుంచి కొత్త భవనం వైపు ఉన్న రహదారిని 200 అడుగులకు విస్తరించాలని, అలాగే భరత్ నగర్ వైపు ఉన్న 30 అడుగుల రోడ్డును కనీసం 100 అడుగులకు పెంచాలని కిషన్ రెడ్డి కోరారు. ఈసీ నగర్ ప్రధాన రహదారి నుంచి ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లే మార్గం చాలా ఇరుకుగా ఉందని, దీనిని 100 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని వివరించారు. రోడ్లతో పాటు వాహనాల పార్కింగ్ కోసం స్టేషన్ కొత్త భవనం వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫామ్ వైపు 2.70 ఎకరాల భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టేషన్ కు నీటి సరఫరా కనెక్షన్ కోసం రైల్వే శాఖ ఇప్పటికే రూ.4 కోట్లు జమ చేసినా, పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదని లేఖలో ఎత్తి చూపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.715 కోట్లతో ముస్తాబవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా స్టేషన్ ఉత్తరం వైపు ఉన్న ఆల్ఫా హోటల్ నుంచి రాటిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించడం వల్ల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని తెలిపారు. ఈ సమస్యలపై గత ప్రభుత్వ కాలం నుంచి తాను పలుమార్లు లేఖలు రాసినట్లు, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ నెలలో విన్నవించినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని భూసేకరణ, రోడ్ల విస్తరణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు.








