* మే 10న సికింద్రాబాద్‌లో ‘జన ఆగ్రహ సభ’.
* రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
* కాంగ్రెస్, బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలకు చరమగీతం.
* తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే.
* మహిళా వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పేందుకే ‘జన ఆగ్రహ సభ.
* తరలిరావాలని యువతకు, మేధావులకు పిలుపు.
* పోస్టర్ ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.
హైదరాబాద్, మహా.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సుమారు రూ. 7,700 కోట్ల నుండి రూ. 8,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు తెలియజేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ‘జన ఆగ్రహ సభ’ అని నామకరణం చేశారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ పర్యటనను చారిత్రాత్మక విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. తెలంగాణలో మార్పునకు సంకేతం
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసిందని రాంచందర్ రావు ధ్వజమెత్తుతున్నారు. గత పదేళ్ల పాలనలో కేవలం కుటుంబ ప్రయోజనాలకే ఆ పార్టీ ప్రాధాన్యతనిచ్చిందని, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. అటువంటి అవకాశవాద రాజకీయాలు ఇకపై తెలంగాణలో సాగవని ఆయన హెచ్చరించారు. బీజేపీ మాత్రమే రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, ప్రజలు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషించారు. మేధావులు, మహిళలు, ముఖ్యంగా జెన్-జెడ్ యువత బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారని ఆయన సగర్వంగా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ తీరును రాంచందర్ రావు తీవ్రంగా ఎండగట్టారు. ‘భారత్ జోడో’ అంటూ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర వాస్తవానికి ‘భారత్ తోడో’ (దేశాన్ని విభజించే) యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం ద్వారా దక్షిణ భారత దేశానికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మహిళా సాధికారతపై మొసలి కన్నీరు కారుస్తూ, క్షేత్రస్థాయిలో మాత్రం హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ ఆగ్రహమే మే 10న పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో మహిళా ప్రాతినిధ్యం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ విఫలమయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో కేబినెట్‌లో మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యువత, మహిళల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ నిరాదరణకు నిరసనగానే ‘జన ఆగ్రహ సభ’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా శక్తిని తక్కువగా అంచనా వేసిన ఏ ప్రభుత్వమైనా పతనం కాక తప్పదని, రాబోయే రోజుల్లో మహిళల ఆశీర్వాదంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
కేవలం తెలంగాణలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ హవా మొదలైందని నేతలు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గణనీయమైన విజయాలను నమోదు చేస్తుందని, పుదుచ్చేరిలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని రాంచందర్ రావు జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అంతటా అభివృద్ధి పరుగులు తీస్తోందని, ఆ అభివృద్ధి ఫలాలను ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. దక్షిణాదిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని, అభివృద్ధికి రాజకీయాన్ని జోడించి ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మే 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ బహిరంగ సభ కోసం పరేడ్ గ్రౌండ్స్‌లో అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, రవాణా సౌకర్యాలపై పార్టీ ముఖ్యనేతలతో రాంచందర్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రసంగం వినేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టులో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని, నేరుగా సభా వేదికకు చేరుకోనున్న ప్రధానికి చారిత్రాత్మక స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణ భవిష్యత్తును మార్చబోయే ఈ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి చేస్తోంది. మేధావులు, విద్యావంతులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని దేశ ప్రయోజనాల కోసం మోదీ చేస్తున్న కృషిని బలపరచాలని కోరారు. ‘జన ఆగ్రహ సభ’ ద్వారా రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గళం ఎత్తాలని పిలుపునిచ్చారు. ఈ సభ తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక నూతన శకానికి నాంది పలుకుతుందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే దిశగా మొదటి అడుగు అని రాంచందర్ రావు తన ప్రసంగాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు.








