Mahaa Daily Exclusive

  సాధాబైనామా కష్టాలకు 45 రోజుల్లోనే విముక్తి…

Share

• త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం.
• ధరణి పాపాలను కడిగేస్తున్న ‘భూభారతి’.
• మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
హైదరాబాద్, మహా.

గడప గడపకూ పాలనను చేరువ చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించిన మంత్రి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజాదర్బార్‌లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, దీర్ఘకాలిక సమస్యలను సైతం గరిష్టంగా మూడు నెలల కాలపరిమితిలోగా పరిష్కరిస్తామని సంచలన ప్రకటన చేశారు.
**సాధాబైనామా చిక్కుముడులకు 45 రోజులే గడువు**
భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో తలెత్తిన సాధాబైనామా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. న్యాయబద్ధంగా ఉన్న ప్రతి సాధాబైనామా దరఖాస్తును రాబోయే 45 రోజుల్లోపు పరిష్కరించి రైతులకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత పదేళ్ల పాలనలో ధరణి పేరుతో రైతులను పీడించారని, ఆ సమస్యలన్నింటినీ ‘భూభారతి’ ద్వారా ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామని వివరించారు. భూమి రికార్డుల్లో పారదర్శకత తీసుకువచ్చి, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
**ఇందిరమ్మ ఇళ్లతో ‘స్వగృహ’ యోగం**
ధనిక రాష్ట్రంగా పేరున్నప్పటికీ గత పాలకులు పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదని మంత్రి విమర్శించారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. ఆరెంపుల గ్రామానికి మొదటి విడతలో 109 ఇళ్లు కేటాయించామని, త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో దశను ప్రారంభించి అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ప్రతి సోమవారం విడుదల చేస్తూ లబ్ధిదారుల్లో నమ్మకాన్ని పెంచామని ఆయన గుర్తు చేశారు.
**రైతు సంక్షేమానికి ‘ప్రజా ప్రభుత్వం’ బాటలు**
గతంలో వరి వేస్తే ఉరి అన్న పాలకుల మాటలను చెరిపివేస్తూ, నేడు రైతులకు అండగా నిలుస్తున్నామని మంత్రి తెలిపారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో చేయలేని రుణమాఫీని తాము కేవలం ఒక్క ఏడాదిలోనే 20,656 కోట్లతో సుమారు 25 లక్షల మంది రైతులకు పూర్తి చేశామని చెప్పారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ ప్రజాదర్బార్ ద్వారా పేదల సమస్యలు నేరుగా అధికారుల వద్దకు చేరుతున్నాయని, వారం రోజుల్లోనే ప్రాథమిక పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Latest