Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అక్షరాలా వంచన…

Share

* సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
* ఎన్నికల వేళ చెప్పిందొకటి, చేసేదొకటి!
*తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న మాట ఏమైంది?
*కుప్పలు తెప్పలుగా ధాన్యం వస్తున్నా కొనుగోళ్లు నిలిపివేత.
* అన్నదాతల పట్ల ప్రభుత్వానికి సోయి లేదా?
*తక్షణమే పంటలు కొనకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తుందని హెచ్చరిక.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక పెద్ద అబద్ధమని, అక్షరాలా అన్నదాతలను వంచించడమేనని అందులో దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కడుతూ, రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తుచేశారు.
**తాలు పేరిట తరుగు.. తోలు తీసేది ఎవరికి?**
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు “తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా” అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిల్లుల వద్ద బస్తాకు కిలో, రెండు కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక మర్మమేమిటని నిలదీశారు. 45 డిగ్రీల ఎండలో రైతులు కల్లాల వద్ద ఎండుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
**బోనస్ ఎక్కడ? శనగ, జొన్న రైతుల గోస ఏది?**
సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 అదనపు భృతి (బోనస్) ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం డబ్బులతో పాటే ఆ బోనస్‌ను కూడా తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం వరి రైతులనే కాకుండా పొద్దుతిరుగుడు, శనగ, జొన్న రైతులను కూడా ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. కేంద్రం కేవలం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని, మిగిలిన 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే ఎటువంటి షరతులు లేకుండా సేకరించాలని సూచించారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉండగా, ప్రభుత్వం కొర్రీలు పెట్టడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు మూడు వేలకే అమ్ముకుంటున్నారని వాపోయారు.
**మొక్కజొన్న నిబంధనలు ఎత్తివేయాలి.. లేకుంటే సమరమే!**
మొక్కజొన్న కొనుగోలు విషయంలో ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే కొత్త నిబంధనను హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం జలాలతో నేడు ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంటే, మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభించకపోవడం వల్ల రైతులు క్వింటాలుకు రూ. 800 నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని లేఖలో హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మొద్దునిద్ర వీడి అన్నదాతలను ఆదుకోవాలని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Latest